(దండుగుల శ్రీనివాస్)
24Vastavam.in (7)
షరా మామూలుగా సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి బీఆరెస్ సోషల్ మీడియా ఆడుకున్నది. మా కేసీఆర్ ప్రాజెక్టులు ప్రారంభిస్తే.. ఈ సీఎం పెట్రోల్ బంకులు ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు. నారాయణపేటలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం పాపమైంది. సీఎం ఏందీ..? ఆఫ్టరాల్ ఓ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి హాజరుకావడం ఏందీ…?? ఇదీ వారి ప్రశ్న. నిలదీత. ఎద్దేవా. వెటకారం. పదేళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ ఓటమి పాలుకాగానే దాన్ని హూందాగా ఒప్పుకుని ప్రజాపక్షం వహించాల్సి ఉండగా…. జనాల మీద అలిగి ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడం తప్పుకాదట.
ఏడాది తరువాత బయటకు వచ్చి .. చూశారా.. నే ముందే చెప్పాను. అత్యాశకు పోయారు.. బాయిలో పడ్డారు.. అంటూ జనాల బాధలను కూడా తన పైశాచికానందంగా భావించి మాట్లాడే ఆ నేత మాటలు కూడా వారికి బాగా నచ్చాయి. అందులో తప్పు కనపించలేదు. ఆయన అధికారంలో ఉన్నన్నాళ్లూ ఏం చేసినా ఓకే. పిచ్చోడి చేతిలో రాయిలా ప్రవర్తించినా శహభాష్.. అనే అన్నాం. సరే అప్పుడు అంటే అన్నారు గానీ. ఇలా ప్రతీ పనికీ వంకలు పెడుతూ ఎడ్డిస్తూ సీఎంను వెంటాడటం ఎందుకు..? నిర్మాణాత్మక విమర్శలు చేయాలె కదా. అది మరిచారు. షరా మూములుగా.. అధినేత దారిలో. అవును … సీఎం రేవంత్ పోయింది పెట్రోల్ బంక్ ఓపెనింగ్‌కే. కానీ అది మహిళల ఆర్థిక స్వావలంభనతో కూడిన కార్యక్రమం.
వారికి భరోసా కల్పించే ఉపాధి మార్గాన్ని చూపే ఓ ప్రోగ్రాం. అలాంటివి విరివిగా పెట్టించి మహిళలు సొంతంగా సంపాదించుకునే ఓ వనరుగా సీఎం చూశారు. మహిళా లోకం సంతోషపడింది. ఇలాంటివి జిల్లాకొకటి ఓపెన్ చేయిస్తానని కూడా చెప్పాడు. మిగిలిన వారు కూడా సంబరపడ్డారు. ఇక్కడ మనమంతా అవమానంగా భావించాల్సిన విషయమేమీ లేదే. విమర్శించాలంటే చాలా విషయాలే ఉన్నాయి. ఉంటాయి కూడా. ఎందుకంత తొందర. ప్రతీదీ ఇలా రచ్చకెక్కి పెంట పెంట చేసుకుంటే మనమాటకు , విమర్శకు, సూచనకు విలువుంటుందా..???