(దండుగుల శ్రీనివాస్)
జైలు నుంచి వచ్చిన తరువాత కవిత వేసే ప్రతీ స్టెప్పు సొంతగా వేస్తున్నట్టే ఉన్నది. అది కేసీఆర్ మార్గదర్శకంలో వెళ్లినట్టుగా అనుకోవడం లేదందరు. కేటీఆర్‌తో అసలే పొసగడం లేదనే విషయం కూడా ఆమె అనుసరిస్తున్న విధానాలను బట్టి ఆమె పరోక్షంగా చెబుతున్నట్టే ఉంది. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయిన తరువాత ఎవరికి తోచిన విధంగా వారు చేసుకుపోతున్నారు. కేటీఆర్‌దో దారి. కవితది మరోదారి. ఇలాగే ఉంది వీరిద్దరి పరిస్థితి. కేసీఆర్ కూడా ఏమీ అనడం లేదు. ఎవరిని. ఇంకా ఓటమి బాధ నుంచి, అధికారం కోల్పోయిన వాస్తవం నుంచి ఆయన బయటకు రావడం లేదు. దీంతో ఎవరి ప్రోగ్రాంలు వారు చేసుకుంటున్నారు.
ఎవరికి తోచిన విధంగా వారు తమ పవర్ సెంటర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనుచరగణాన్ని కాపాడుకుని గ్రూపు రాజకీయాలను పోషించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. దళితబంధు పై ఓ మీటింగు పెట్టింది కవిత. దీనిపై ఆ పార్టీలోనే విమర్శలు మొదలయ్యాయి. కేసీఆర్ ఓటమికి ఈ పథకం కూడా ఓ ప్రధాన కారణమనే భావిస్తున్నాయి బీఆరెస్ శ్రేణులు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. అలాంటి పథకంపై కవిత ఎందుకు పోరాటం చేస్తానని ప్రకటిస్తుందో అర్థం కావడం లేదని వారు వాపోవడం చూస్తుంటే .. కవిత తనకు తానుగానే కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతుందనే విషయం తేటతెల్లమవుతోంది.
అప్పటి సిట్టింగు ఎమ్మెల్యేతో సహా బీఆరెస్ శ్రేణులంతా ఈ పథకాన్ని పర్సెంటీల రూపంలో పంచుకుని దండుకునే పథకంగా మార్చారు. మొదటి విడతలోనే పెద్ద అవినీతికి కేంద్రబిందువైంది. రెండో విడత వచ్చేసరికి సర్కార్ ఓడిపోయింది. ఆ తరువాత కమీషన్ల భాగోతం బయటపడింది. సిట్టింగు ఎమ్మెల్యేలు, అనుచరుల అవినీతి అంతా వెలుగు చూసింది. ఇప్పుడు ఇలాంటి పథకంపై కవిత పోరాటం చేస్తానంటుందన్నది.. అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది దేశంలో తన రాజకీయ ప్రస్థానాన్ని విస్తరించుకునేందుకు. చూశారా…? నేను దళితుల కోసం పది లక్షలిచ్చే పథకాన్ని ప్రవేశపెట్టా.. మీరెందుకున్నారు..? ఇన్నాళ్లూ రాజకీయం చేశారుగా..! దళితుల కోసం ఏనాడైనా ఇలాంటి ఆలోచన చేశారా..! నేను గ్రేట్.. నేనే గ్రేట్ అనిపించుకునేందుకు. అది కాస్తా మొదటి విడతకే బెడిసి కొట్టి అవినీతికి ఆలవాలంగా మారింది. ఇప్పుడు దీన్ని దళితులు కూడా ఎవరూ కోరుకోవడం లేదు.. బీసీలు కేసీఆర్ పై అప్పుడే గుర్రుమన్నారు.బీసీ పాట పాడుతున్న కవిత.. హఠాత్తుగా దళితరాగం అందుకున్నది. కానీ ఆ పథకమే పెద్ద లోపాల పుట్ట, అవినీతి చిట్టా అనే విషయం మరిచిపోయింది. ఇలా విమర్శలపాలవుతున్నది.