(Dandugula Srinivas)
రేవంత్‌కు రక్షణ కవచంలా ఉన్నస్వేచ్ఛ డిజిటల్ పేపర్‌లో కవిత గురించి పాజిటివ్ వార్త రావడం చర్చనీయాంశమైంది. బీఆరెస్‌పై విరుచుకుపడే వార్తలతో వచ్చే పేపర్‌లో అనుకోకుండా కవిత గురించి కీర్తిస్తూ రాయడం కలకలం రేపింది. ఇది నిజంగా ఆమె పట్ల ఉన్న అభిమానంతో రాశారా..? విడదీసే రాజకీయాలకు ఆజ్యం పోయడంలో భాగమా అనే డిస్కషన్ కూడా నడుస్తోంది. జైలునుంచి వచ్చిన తరువాత కవిత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న కవిత ఆ తరువాత యాక్టివ్ అయ్యింది. కేటీఆర్‌కు కవితకు మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం నేపథ్యంలో ఆమె రాజకీయంగా యాక్టివ్ కావడం ఆ ఫ్యామిలీకి సుతారమూ ఇష్టం లేదనే చెప్పాలి. దీంతో ఆమె సొంతంగానే కార్యక్రమాలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నది.
ఈ క్రమంలో తాజాగా దళితబంధుపై ఆమె పెట్టిన సమీక్ష ఆ పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తిని నింపింది. ఇలా ఎవరు చెబితే వారి మాట విని కార్యక్రమాలు చేస్తూ పోతే ఇప్పటికే పార్టీకి నష్టం బాగా జరిగిందని, ఇది మరితంగా పెంచే విధంగా కవిత చర్యలు ఉండరాదని వారు సోషల్ మీడియా వేదికగా ఆమెకు హితవు పలికిన సందర్భాన్ని కూడా వాస్తవం మీడియాలో కథనం ప్రచురితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నం కవిత సీరియస్‌గా చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడంతో కేటీఆర్ దీన్ని మంచి అవకాశంగా తీసుకున్నాడు. ఒంటి చేత్తో పార్టీని నడిపించగలనని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టగలనని నిరూపించుకునే పనిలో తహతహలాడుతున్నాడు. ఈ క్రమంలో కేటీఆర్ కూడా తప్పటడుగులు వేస్తూ వస్తున్నాడు. కేసీఆర్ తరువాత కేటీయారే అనే ప్రచారం ముందునుంచీ ఉంది. కవిత జైలుకు పోయిన తరువాత ఆమె రాజకీయ ప్రస్థానం కొంత మసకబారింది.
ఇది మళ్లీ నిలబెట్టుకుని తన ఉనికి చాటుకోవాలంటే ఎవరో చెబితే కానీ ముందడుగు వేయలేని నిస్సహాయ స్థితి నుంచి ఆమె బయటపడాలనుకున్నది. ఇప్పుడదే ఆమె చేస్తున్న పని. అందుకే అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నది. చేసిన తప్పులు దిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తున్నది. ఉద్యమకారులను, బీఆరెస్ శ్రేణులందరినీ దగ్గరికి తీసే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడిదంతా కవిత గురించి చర్చించుకోవడమెందుకంటే… రేవంత్ రక్షణ కవచం స్వేచ్ఛ పత్రికలో ఆమెపై పాజిటివ్ వార్త రాయడం. దీనిపై విభిన్న కోణాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ దూకుడుకు కళ్లెం వేసి చెల్లె కవితను ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నం.. ఇది పక్కా కాంగ్రెస్ పత్రిక అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మేము అందరివారం అందరి వార్తలు రాస్తాం అని చెప్పుకునే ఓ విఫలయత్నం.