(దండుగుల శ్రీనివాస్)
మొన్నటి దాకా రా బయటకు… వస్తావా రావా…. నీకెందుకు ఫామ్ హౌజ్లో పండుకుని ప్రతిపక్ష పాత్ర అన్నాడు రేవంత్. ఇక కేసీఆర్ బయటకు వస్తున్నాడని తెలిసి స్వరం మార్చాడు. దూకుడు పెరిగింది. మాటల దూకుడు జోరందుకుంది. ఏ మీటింగు వెళ్లినా సందర్భం మరేదైనా ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ రేవంత్‌కు. ఉతికారేస్తున్నాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నాడు.
అసలు తెలంగాణలో జీవించే హక్కే కేసీఆర్‌కు లేదన్నాడు. నువ్వు గట్టిగా దెబ్బ కొడతానంటున్నావ్.. నిన్నే కొట్టి పండబెట్టాం. తెలంగాణ సమాజమే కర్రు కాల్చి వాత పెట్టింది. ఇక నువ్వు మమ్మల్ని దెబ్బ కొట్టుడా..? ముందు నీ బిడ్డెకు, కొడుకుకు, అల్లుడికి గట్టిగా దెబ్బలు కొట్టుకుని సరిచేసుకో… అంటూ తీవ్రంగానే మాట్లాడుతున్నాడు రేవంత్. సమగ్ర కుల సర్వే లో సర్వే చేయించుకోని కేసీఆర్‌ను, కేటీఆర్‌ను, హరీశ్‌ను సాంఘీక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చాడు. అంతే కాదు తీర్మానం కూడా చేశాడు. వీళ్ల ఇళ్ల ముందు మేల్కొల్పు డప్పు కొట్టాలని కూడా ఎగదోశాడు.
పనిలో పని మరో కార్యక్రమంలో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. భవిష్యత్ తరాలు ఇదే అనుకునే ప్రమాదం ఉందని కూడా చెప్పాడు. ఎంతో మంది త్యాగధనులు, ఉద్యమకారుల జీవిత త్యాగాల మూలంగానే తెలంగాణ సాకారమైందని , ఈ చరిత్రను నిక్షిప్తం చేసి భావితరాలకు అందించాలని కూడా పిలుపునిచ్చాడు. ఈనెల 19న బీఆరెస్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేసీఆర్ వస్తున్నాడు. ఇది కీలకమైన మీటింగుగా భావిస్తున్నారు.
ఈనెలాఖరులోగా వరంగల్‌లో ఏ మీటింగు కూడా పెట్టేందుకు సిద్దమయ్యారు. ఈనెల 17న కేసీఆర్ బర్త్‌డే. అంటే బర్త్ డే తరువాత ఫామ్‌హౌజ్ వీడుతాడన్నమాట.
రేవంత్ కు తన తడాఖా చూపుతాడన్నమాట. అందుకే రేవంత్ ఇలా దూకుడు పెంచాడు. స్వరం పెంచి మరీ తిడుతున్నాడు. ఘాటు వ్యాఖ్యల స్పీడు పెంచాడు. ఇప్పడే ఇలా ఉంటే ఇక మీటింగు అయి.. కేసీఆర్ విమర్శలకు రేవంత్ ప్రతి విమర్శలు… ఆరోపణలకు ప్రత్యారోపణలు.. ఇక రాజకీయాలు రంజుగా మారనున్నాయి. నిన్నటి వరకు రేవంత్ కేటీఆర్ మధ్య నడిచింది వార్. ఇప్పుడు కేసీఆర్ రంగ ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి మాజీ సీఎం, సీఎంల మధ్య రసవత్తర పోరు… మాటల జోరు.. తిట్ల హోరు కొనసాగనుంది.