(దండుగుల శ్రీనివాస్)
రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మధ్య దూరం పెరిగిందని వాస్తవం చెప్పిన కథనాల నేపథ్యంలో ఇవాళ రాహుల్‌ను ఎట్టకేలకు కలిశాడు రేవంత్. అదీ ఒక్కడే. ఎవరూ లేరు వెంట. అలా వెళ్లి ఇలా వెళ్లి మాట్లాడి వచ్చాడు. బయటకు వచ్చి చర్చించాడు మీడియాతో. వాస్తవంగా రాహుల్‌ను ఇన్ని రోజుల తరువాత కలిసినప్పుడు ఆయన వెంట ఒకరిద్దరు నేతలు కూడా ఉంటారు. లేక లేక అపాయింట్‌మెంట్ ఇచ్చాడు రాహుల్. అదీ హడావుడిగా. రేవంత్ అడిగితే. అవును. మరి మీడియాలో చిలువలు పలువలుగా కథనాలు వస్తున్నాయాయే. రాహుల్ అసలు రేవంత్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, గుస్సాగా ఉన్నాడని. కులగణన విషయంలో రాహుల్ బాగా సీరియస్ అయ్యాడు.
అది నవ్వులపాలు కావడం పట్ల రేవంత్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు రాహుల్. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో హడావుడి అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు రేవంత్. ఉన్నపళలంగా ఢిల్లీ పయనమయ్యాడు. రాహుల్‌ను కలిశాడు. కులగణన, వర్గీకరణపై మాట్లాడానని, వేరే విషయాలు డిస్కషన్ కు రాలేదన్నాడు. మంత్రి వర్గ విస్తరణ గురించి ఊసేలేదట. అంటే తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లన్నమాట. మీకు అధికారం ఇస్తే ఏడాది పూర్తయిన మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయలేని నిస్సాహాయ ప్రభుత్వం అవసరమా..? ఆ ఊసు ఎందుకు రాలేదు. అసలు నీకు మాట్లాడే చాన్స్ వచ్చిందా… ? ఇప్పుడు ఇవీ తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే కీలకమైన శాఖలన్నీ సీఎం చేతిలోనే ఉన్నాయి.
సీఎం రోజుకు పట్టుమని ఒకటి రెండు శాఖలపై కూడా రివ్యూలు చేయలేని స్థితి. మరెందుకు మంత్రివర్గ విస్తరణ చేయడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ, సీఎం వైఫల్యమే కదా. దీన్నిచాలా లైట్‌గా తీసుకున్నట్టు మాట్లడాడు సీఎం రేవంత్. ఇక సీఎంవో గ్రూపులో సీఎం ఎటుపోయినా ఫోటోలు, మ్యాటర్ వచ్చేవి. కానీ ఢిల్లీ వెళ్లి రాహుల్‌ను కలిసినా ఆ గ్రూపులో ఫోటోలు లేవు. అదీ వీరి పనితనం. ఏదో అంతా అనుకుంటున్నారు. తనకు రాహుల్‌కు మధ్య గ్యాప్ ఉంది. ఇక మున్ముందు సీఎంగా తను కొనసాగలేడు. అందుకే ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు.. అనే ప్రచారానికి చెక్‌పెట్టి , తన పనితనం వివరించుకుని దాసుడు తప్పులు దండంతో సరి అని చెప్పుకునేందుకే సీఎం ఢిల్లీ టూర్ కొనసాగినట్టుగా అనుకోవాలి.అంతే.