మ్యాడం మధుసూదన్
(సీనియర్ జర్నలిస్టు)
9949774458
ఢిల్లీలో రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌పై సీరియస్ అయ్యారు. వరంగల్‌లో ఆకస్మిక పర్యటనను రద్దు చేసుకున్నారు. రాహుల్ వచ్చేది పోయే సమాచారం సీఎం రేవంత్ రెడ్డికి చేరలేదు. బీసీ కులగణనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ గుస్సా కావడంతో రెండో దఫా కులగణన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఒక్కదాని వెంట ఒకటి జరుగుతున్న పరిణామాలు ఢిల్లీ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ కు మధ్య గ్యాప్‌ను మరింత పెంచింది. బీసీల కులగణనలో విమర్శలకు, లోపాలకు ఎందుకు ఆస్కారమిచ్చారని సీరియస్ అయినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం.
రాహుల్ గాంధీ కన్నెర్ర జేయడంతో మళ్లీ రెండో దఫా కులగణన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నేడో రేపో అనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రికి సరైన సమాచారం అందకపోవడం గందరగోళానికి దారి తీసింది. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం, వరంగల్ టూర్ రద్దుపై చెప్పకపోవడం.. ఇటీవల రెండు రోజుల పర్యటనలో కూడా కలవకపోవడం అధిష్టానానికి ప్రభుత్వానికి మధ్య అంతరం అగాధంగా మారుతున్నది.
వాస్తవానికి హైదరాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి హన్మకొండకు వెళ్లి అక్కడ జనంతో మాట్లాడాలనుకున్నారు రాహుల్. ఇదే విషయాన్ని ఢిల్లీ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కు చేరవేసింది. దీంతో హడావుడిగా స్వాగత ఏర్పాట్లు చేసుకుంది. ముఖ్యమంత్రి బేగంపేటలో రాహుల్‌కు స్వాగతం పలకాలనుకున్నారు. కానీ ఏమైందో ఏమో.. పార్లమెంటులో అత్యవసర సమావేశాలున్నాయి.. రద్దు చేసుకున్నట్లు సమాచారమిచ్చారు. ముఖ్యమంత్రికి రాహుల్ వచ్చే విషయం, రద్దైన విషయం రెండు కూడా ఢిల్లీ పార్టీ సమాచారం ఇవ్వకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇదే సమయంలో కొందరు ఢిల్లీకి వెళ్లి బీసీ కులగణన అపసవ్యంగా ఉందని, ఎన్నో లోపాలున్నాయని పిర్యాదు చేశారు.
దీనిపై ఆరా తీసిన రాహుల్ గాంధీ 13 లక్షల మంది సర్వేలో పాల్గొన్నా ఎందుకు కరెక్టుగా చేయలేదు. కుల గణనను ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదని ప్రశ్నించినట్టు సమాచారం. ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వారందరి వివరాలు తీసుకోవాలని ఆదేశించారు. కథ మళ్లీ మొదటికొచ్చింది. కుల గణన పూర్తయ్యింది.. బీసీల నినాదం, రేషన్‌కార్డుల, రైతుభరోసా వంటి కార్యక్రమాలతో ఇంకా జనం లో అసంతృప్తి రాకముందు.. లోకల్ బాడీ ఎన్నికలు జరపాలనుకున్న టీ కాంగ్రెస్‌కు ఇది శరాఘాతంగా మారింది. రెండో దఫా సర్వే కారణంగా ఎండాకాలం పూర్తయ్యే వరకు స్థానిక ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాల క్రమంలో మనం గతంలో చెప్పుకున్నట్టు పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతరం ఉన్నట్టు స్పష్టమవుతున్నది. రేవంత్ రెడ్డి చేసే కొన్ని సాహాసోపేతమైన నిర్ణయాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఢిల్లీ నుంచి సరైన సంపూర్ణ సహకారం అందడం లేదు.
ప్రతిదానికి అనుమానాలు సందేహాలు వ్యక్తం చేస్తూ నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారంలో ఉంది. ఇటీవల ఢిల్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయడం ఖాయమైంది. కానీ చివరి నిమిషంలో రద్దైంది. ఆ రద్దుకు కూడా పార్టీలో అంతర్గతంగా తలెత్తిన పరిణామాలే కారణమని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఢిల్లీకి దాదాపు 20 సార్లు వెళ్లినా రాహుల్ గాంధీ ఆయనను కలవకపోవడం నెగిటివ్ ప్రచారానికి దారి తీసింది. తమ అనుమతి లేకుండానే స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు అత్యంత వివాదస్పదమైన పారిశ్రామిక వేత్త అదానీ నుంచి తీసుకోవడం రాహుల్‌కు ఆగ్రహం తెప్పించింది. అక్కడి నుంచే రాహుల్‌కు రేవంత్ కు మధ్య గ్యాప్ పెరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఢిల్లీ కాంగ్రెస్ ప్రతిష్టను పెంచే విధంగా లేవని సమన్వయలోపం స్పష్టంగా ఉందని కేసీ వేణుగోపాల్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏ సమాచారమైనా ముందుగా తెలవాల్సింది సీఎంకు. కానీ రాహుల్‌గాంధీ వరంగల్ ఆకస్మిక పర్యటన రద్దు విషయాలు సీఎం వరకు చేరలేవని జరుగుతున్న ప్రచారం పార్టీలో తీవ్రతకు అద్దం పడుతున్నది. నిజానికి తన వ్యక్తగత పాపులారిటీతో కాంగ్రెస్‌ను అధికార పీఠం దరికి చేర్చిన రేవంత్ రెడ్డికి దూకుడుగా కొన్ని నిర్ణయాలు తీసుకుని మళ్లీ వెనుకడుగు వేయడానికి ఢిల్లీ అధిష్టానంతో ఉన్న అంతరమే కారణమని ఇప్పుడు అర్థమవుతున్నది. ఏదో చేయాలనుకుంటే ఏదో అయినట్టు ముఖ్యమంత్రికి అధిష్టాన వర్గం నుంచి పెద్దగా సపోర్టు లేకపోయినా… స్థానికంగా ఉండే ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. అసలే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం అధిష్టానం నుంచి కూడా అభయహస్తం లేకుండా పోతున్నది. మేమున్నాం ముందుకు పదండి అంటూ అధిష్టాన వర్గం భరోసా ఇవ్వడం లేదు. ఆర్థిక సమస్యలతో అంతర్గత విభేదాలు, అధిష్టానంతో అంతరాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.