(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్‌ను ఓడగొట్టుకున్నందుకు జనాలు బాధపడుతున్నారు. మన తప్పేం లేదు. జనాలే మోసపోయారు. మన సారు ఐఫోను.. రేవంతు చైనా ఫోను. మొత్తంగా కవితక్క, రామన్న, హరీషు, కేసీయారు… చెప్పొచ్చేదేమిటంటే.. మనం కరెక్టే. జనాలే తప్పు. అందుకే తప్పుగా ఓటేసి రేవంతును ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించారు. మన దగ్గర తప్పులేం లేవు. అంతా ఓకే. పదేండ్లు తెలంగాణలో స్వర్ణయుగం. ఇవే వారి మాటలు అటూ ఇటూగా. ఇక మనం మారం అనే విషయం వారి నోటి వెంటే ఇలాంటి ఆణిముత్యాలు రాలుతున్న సమయంలో వారంతట వారే బయటపడుతున్నారు. పేదలకు కావాల్సింది ఐఫోను కాదు. అందుబాటులో ఉండే ఫోను. అంతే.
అసలు ఐఫోను అంటే కూడా తెలియని జనం తెలంగాణలో సగానికి పైగానే ఉంటారు. ఇప్పుడు ఆ ఐఫోను ఫామ్‌హౌజ్‌లో సేద తీరుతున్నది. చైనా ఫోను అందుబాటులో ఉంది. బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఓ పెద్దాయన మొన్న ఫోన్లో మాట్లాడుతూ అన్నాడు. కాంగ్రెస్ అంటే వ్యతిరేకత పెరుగుతున్నది. కానీ అదే సమయంలో బీఆరెస్ అంటే అంత సానుభూతి రావడం లేదు. ఎందుకు..? అన్నాన్నేను. ఆశ్చర్యంగా. వీరింకా మారలేదు. అదే అహంకారం. తమ తప్పులే లేవన్నట్టుగా వారి ప్రవర్తన. వారి వ్యవహారం ఇంకా అలాగే ఉంది. ఇది ఆ లీడరు కోపంతో అన్నట్గుగా అనిపించలేదు. ఎందుకంటే అతగాడు కేసీఆర్‌కు వీరాభిమాని. ఇప్పుడు కవితక్క విషయానికొద్దాం. కేసీఆర్ ఐఫోన్ అంట. రేవంత్ చైనా ఫోన్ అంట.
ఆయన ఫామ్ హౌజ్‌లోనే ఉన్నాడు. సోషల్ మీడియాలో ఎవరేమనుకుంటున్నారని కళ్లు ఒళ్లు ధ్యానం జ్ఞానం అంతా దానిపైనే పెట్టాడు. తమ లోపాలేమిటో ఆయనకు తెలుసు. కానీ ఒప్పుకోడు. జనాలు రేవంత్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఎంతగా బాధపడి గిలగిల్లాడిపోయి తనను గుర్తు చేసుకుంటే ఆయనకు అంత మంచిది. అసలు ఈ పథకాలు ప్రవేశపెట్టి సాధించిందేమిటి..? రాళ్లకు రప్పలకు రైతుబంధవన్నావు. ప్రజల సొమ్ము అప్పనంగా ధారపోశావు. దళతబంధు పేరుతో దగా. ఆ పథకం ఈ పథకం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలతో తనదైన కొత్త ఒరవడిని సృష్టించాడు. కేసీఆర్‌ను మట్టి కరిపించేందుకు రేవంత్ రెండాకులు ఎక్కువే చదివాడు. నాలుగు అబద్దాలు ఎక్కువే ఆడాడు.
పథకాలను పరుగులు పెట్టించేందుకు నీకంటే నేనే ఘనుడనని ప్రగాల్బాలు పలికాడు. మొత్తంగా కేసీఆర్ ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తే.. రేవంత్ వచ్చిన అధికారాన్ని కాపాడుకోలేక.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజాక్షేత్రంలో చతికిలబడుతున్నాడు. ఈ పాపం ఎవరిది అక్కా… మన నాయనదే. అదే మన ఐ ఫోన్‌దే.