(దండుగుల శ్రీనివాస్)
తెలంగాణ జన సమితి టీమ్ ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ , ప్రొఫెసర్ కోదండరామ్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. ఎందుకు..? రేవంత్‌తో కటీఫ్ చేసుకుందామని. అవును..! తమను పట్టించుకోని చోట ఎందుకు ఆ పార్టీని, ప్రభుత్వాన్ని పట్టుకు వేలాడాలె అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆదివారం టీజేఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కీలక భేటి వాడివేడిగా సాగింది.
జిల్లాల అధ్యక్షులతో పాటు రాష్ట్ర కార్యవర్గం కీలక నేతలంతా పాల్గొన్న ఈ సమావేశానికి కోదండరామ్ అధ్యక్షత వహించారు. నాడు పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో తమ కార్యాలయానికి స్వయంగా వచ్చిన రేవంత్.. జన సమితి ముఖ్య నేతలతో భేటీ అయి ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని పోటీ చేయొద్దని కోరిన విషయాన్ని గుర్తు చేస్తూనే… ఆనాడు రెండు ఎమ్మెల్సీ పదవులు, ఐదు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, ఐదు జిల్లా స్థాయి పదవులతో పాటు మండలాల వారీగా పదవుల్లో తమకు ప్రయార్టీ ఇస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన విషయాన్ని రేవంత్ మరిచిపోయాడని గుర్తు చేసుకున్నారు. కనీసం తమను కీలకమైన సమావేశాల్లో భాగస్వాములను చేయడం లేదని అసంతృప్తి, జిల్లా వారీగా తమ పార్టీ నేతలను కలుపుకుపోవడం లేదని అసహనం ఈ మీటింగులో వారంతా వ్యక్తం చేసినట్టు తెలిసింది.
సీఎంతో కోదండరామ్ పలుమార్లు కలిసినా అక్కడి నుంచి పెద్దగా స్పందన కరువైంది. ఇక తాడోపేడో తేల్చుకుందామనే ఈ మీటింగు పెట్టుకున్నట్టు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాడివేడిగా సాగిన ఈ మీటింగు అనంతరం కోదండరామ్ వారిని ఓ వారం రోజులు గడువు కోరినట్టు తెలిసింది. ఈ విషయాలన్నీ సీఎంతో చర్చిస్తానని ఆ తరువాత మీటింగులో జరిగిన కీలక నిర్ణయాలు అమలు చేద్దామనే ఆలోచనకు వచ్చారు.
గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీకి నో మద్దతు…!
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచించుకునే యోచనలో టీజేఎస్ కనబడుతోంది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచినా కోదండరామ్ టీమ్‌ను, తెలంగాణ జన సమితి ముఖ్య నేతలను రేవంత్ సర్కార్ పట్టించుకోలేదు. అప్పుడు పదవుల ఆశ చూపి తమను పోటీలో లేకుండా చేసుకుని తమ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్.. అది మరిచి ఇప్పుడు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆగ్రహం వారిలో పెల్లుబుకింది. దీంతో గ్రాడ్యూయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థికి తమ మద్దతుండబోదని సిగ్నల్ కూడా రేవంత్‌కు ఈ వేదికగా ఇచ్చారు.
సింగిల్‌గా లోకల్ ఫైట్..!
సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పొత్తు కావాలని డిమాండ్ చేస్తున్నది టీజేఎస్. కొన్ని సీట్లు వారు కోరుకుంటున్నారు. అవి కాంగ్రెస్ ఇవ్వకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేద్దామని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న ఈ సమయంలో తమలాంటి వారిని పక్కన పెట్టేసి పోవడం కూడా ప్రభుత్వానికి మరింత డ్యామేజీ చేస్తుందనే విషయాన్ని కూడా పరోక్షంగా రేవంత్ సర్కార్‌కు ఈ వేదికగా తెలియజెప్పే ప్రయత్నం చేసింది కోదండరామ్ అండ్ టీమ్. కీలకమైన పథకాల రూపకల్పన, లబ్దిదారుల ఎంపిక విషయాల్లో జిల్లాల వారీగా తమ నేతలను కనీసం పట్టించుకోవడం లేదని, వారి సూచనలు పరిగణలోకి తీసుకోవడం లేదనే అసంతృప్తిని కూడా తెలియజేశారు ఈ మీటింగులో.
వారం తరువాత భవిష్యత్ కార్యాచరణ….
రేవంత్‌తో కలిసి నడుద్దామా కటీఫ్ చేద్దామా..? అనే విషయంలో వారం గడువు కోరిన నేపథ్యంలో మరోసారి భేటీ అయ్యేందుకు నిర్ణయించారు. ఈ భేటీ అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. వాస్తవానికి రేవంత్ ఇవేమీ పెద్దగా పట్టించుకునే స్థితిలో ప్రస్తుతం లేరు. ఎందుకంటే సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నారు. అధిష్టానం అతనికి పూర్తి స్వేచ్చ ఇవ్వడం లేదు. మంత్రి వర్గ విస్తరణ ఇంత వరకు జరగనీయకుండా అడ్డుకుంటున్నది కూడా ప్రభుత్వంలోని పెద్దలు, అధిష్టానం. ఈ పరిస్థితుల్లో కోదండరామ్‌ను కూల్ చేసి పంపడమే తప్ప.. చూద్దాం చేద్దాం అని తియ్యటి మాటలతో కాలం వెళ్లదీయడమే కానీ వెంటనే ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చేలా లేవు. మరదే జరిగితే వారంత తరువాత రేవంత్‌తో కటీఫ్ చేస్తారా..? ఇంకొంత కాలం వేచి చూసే దోరణినే పాటిస్తారా..! చూడాల్సి ఉంది.