(దండుగుల శ్రీనివాస్)
ఇదే మంచి తరుణమన్నారు సీఎం. ఇకపై మళ్లీ తనకు ఇలాంటి బృహత్తరమైన చాన్స్ రాబోదన్నారు. మరో పదేండ్లు.. అంటే రెండు టర్నులు సీఎంగా ఉంటానని కూడా పరోక్షంగా వెళ్లడించారు. ఈ సమయంలోనే మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అన్ని విధాల్లో అభివృద్ది చేసుకుందామన్నారు. ప్రపంచానికే మనం ఆదర్శంగా నిలుద్దామన్నారు. ఇదంతా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కొడంగల్‌లో జరిగిన సభకు హాజరై మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. అచ్చంగా గతంలో మాదిరిగానే.. చంటి లోకల్ స్పీచే.
తను సీఎం అనే విషయం అక్కడ పోగానే బహుశా రేవంత్‌రెడ్డి మరిపోతారనుకుంటా. తనో ఎమ్మెల్యేనే అనుకుంటారు. లోకల్ ఇష్యూల మీదే దంచికొడతారు. లోకల్ లెక్కలే వళ్లెవేస్తారు. లోకల్ డెవలప్‌మెంట్‌పైనే జపం చేస్తారు. జరిగేది రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం. అందరూ సీఎం స్పీచ్ గురించి ఆసక్తిగా గమనిస్తారు. ఏం చెబుతారో..? ఇంకేం కొత్త పథకాలు వస్తాయోనని. కానీ అవేవీ వుండవు. మన నియోజకవర్గం. మనం. మన ప్రజలు. మన లోకల్. మనం మనం. మనమంతా. మనల్ని పట్టించుకోలే. మనం వెనుబడ్డాం. మన దగ్గరికే అన్నీ తెస్తున్నాం. ఇంకా తెస్తా ఇక్కడికే. ఇక్కడి కోసం ఏమైనా చేస్తా…. ఇగో ఇవే మాటలు.
కనీసం ఎవరేమనుకుంటారో.. అని కూడా చూడరు. అంత ప్రేమ మన సీఎంకు ఆ నియోజకవర్గం అంటే. సరే గానీ మరో పదేండ్ల పాటు నేనే సీఎంనని చెప్పేశారీవేదికగా అందరికీ. ముఖ్యంగా సీఎం సీటు కోసం పోటీలు పడి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సీనియర్‌మోస్టులకు. పనిలో పని చివరగా తన అన్న తిరుపతిరెడ్డే ఇక ఇక్కడ అంతా చూసుకుంటారని కూడా బహిరంగ అధికార ప్రకటన చేసేశారు. ప్రకటన చేయకున్నా అక్కడ జరిగేదదే.
కానీ మాటిమాటికి కేటీఆర్ నువ్వెవరు అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అని అనడం.. ఏదో మీడియాలో ఇది రావడం చికాకు తెప్పించినట్టుంది సీఎంకు. అందుకే ఇకపై ఇలాంటివి చెప్పొద్దు. నేను చెబుతున్నాగా. మా అన్నే ఇక్కడ అన్నీ. నేను లేని లోటు ఆయన తీరుస్తడు. అని చెప్పేశాడు. ఇక అధికారుకు అక్కడ తలనొప్పి పోయింది. ఇప్పుడు భయం లేకుండా సీఎంకు ఇవ్వాల్సిన మర్యాదలు, ప్రొటోకాల్స్ బాజాప్తా, బహిరంగంగానే పాటిస్తారు.
ఎవరేమినకుంటే మాకేం అన్నట్టు. ఎమ్మెల్యేగా గెలిచి ఫామ్ హౌజ్‌కే పరిమితమైన కేసీఆర్.. అసెంబ్లీకి రావడం లేదెందుకు…? నీకెందుకు పదవి అన్న సీఎం.. ఏమీ అధికారం లేకపోయినా.. అన్న తిరుపతిరెడ్డికి మాత్రం అనధికార అధికారాలు కట్టబెట్టారు. జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందమే. రేవంత్ రెడ్డిలా.