వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. పద్మ అవార్డుల ఎంపికలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్న ఆయన.. ఈ విషయంలో కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు.
యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళితే కొంతమంది చేసే విషప్రచారానికి యూనివర్సిటీలు వేదికలు కాబోతున్నాయని, ప్రధాని మోదీకి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా ..మీరు యూజీసీ నిబంధనలు మార్చాలనుకోవడం రాజ్యాంగంపై దాడి చేయడమేనని విమర్శించారు. ఇది రాష్ట్రాలపై సాంస్కృతిక దాడి చేయడమేనని, ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రాల అధికారాలను ఒక్కొక్కటిగా కేంద్రం తీసుకుంటూ వెళితే..రాష్ట్రాలు కేవలం పన్నుల వసూలు చేసే సంస్థలుగా మిగలాల్సి వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా మేధావులు ఆలోచన చేయాలని కోరారు.