(దండుగుల శ్రీనివాస్)
రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ పథకం హైలెట్. జనాలకు బాగా దగ్గరైన పథకం. దీన్ని రాజకీయాలకు అతీతంగా హర్షించారు. గవర్నమెంట్ దవాఖానలు పట్టింపులేకుండా పోతాయనే విమర్శలు ఉండనే ఉన్నా.. పేదోడికి కార్పొరేట్ వైద్యం ఫ్రీగా అందుతుందనే నిజం అందరికీ నచ్చింది. ప్రాక్టికల్‌గా అది జనాలందరికీ సుపరిచితమైంది. అనుభవంలోకి వచ్చింది. 108 అంబులెన్స్‌లు కూడా వైఎస్ హయాంలోనే విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ఆ సర్కార్‌కు ఇవి ఆయువు పట్టుగా నిలిచాయి. అందుకే వీటిని ఓన్ చేసుకుని వైఎస్.. ఎక్కడ ఏ మీటింగు జరిగినా.. కుయ్..కుయ్…. అని క్షణాల్లో మీ ముందు అంబులెన్స్‌లు ఉంటున్నాయి.
మీకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత కార్పొరేట్ వైద్యం అందుతున్నదని గుర్తు చేసేవారు. ఆయన కుయ్.. కుయ్.. కుయ్.. అని ఎడమ చేతిని గాలిలో అలా ఊపుతూ ఆ శబ్దానికి తగ్గట్టుగా చూపే అభినయం.. అందరినీ ఆకట్టుకునేది. ఆ తరువాత కేసీఆర్ కూడా టింగు… టింగు అనే పదాన్ని బహిరంగ సభల్లో వాడి తనకో ట్రెండ్ సెట్ చేసుకున్నారు. రైతు బంధు డబ్బులు ఇలా ఒకేసారి బ్యాంకు నుంచివచ్చి ఖాతాల్లో పడిపోతున్నాయని, టింగు.. టింగు అని రైతుల సెల్ ఫోన్లకు మెసేజ్ లు వస్తున్నాయని ఆయన చెప్పేవారు.
ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా ఇదే పథకాన్ని మార్చి కొంచెం నిధులు ఎక్కువ చేసి మరీ ఇస్తున్నారు. రైతుబంధుకు బదులు… రైతు భరోసా. పదివేలకు బదులు.. పన్నెండు వేలు. రైతుల ఖాతాల్లో అమౌంట్ పడే విషయాన్ని చెబుతూ రేవంత్… టకీ టకీ మని అనే పదం వాడారు. కుయ్.. కుయ్..తో ఒకరు జనాన్ని ఆకట్టుకుంటే.. టింగ్ టింగు మంటూ కేసీఆర్ జనాలకు రీచ్ అయ్యారు. కేసీఆర్‌కు మించి నేను చేసి చూపుతున్నానని చెప్పుకుంటున్న రేవంత్.. టకీ టకీ అంటూ జనం ముందుకొచ్చారు.