(దండుగుల శ్రీనివాస్)
ఏం చిల్లరగాళ్లురా మీరు… ఓ సినిమాలో ఫేమస్ డైలాగిది. ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ఫేక్‌వార్తల ట్రెండ్ చూస్తే వారికి ఇది అచ్చంగా సరిపోతుంది. ఏదో ఒక పేపర్ క్లిప్పుంగును సృష్టిస్తున్నారు. అందులో తమకు నచ్చిన ఓ తప్పుడు మరీ దిగజారుడు.. చీప్ వార్తలు ఏర్చి కూర్చి వండి వార్చి వదలుతున్నారు. అబద్దం ఆడితే అతికినట్టుండాలంటారు. అవి అతికినట్టు కాదు.. వికారపు వాంతులొచ్చినట్టుగా ఉంటున్నాయి. బుద్దున్నోడెవడైనా వాటిని చూడగానే అది అచ్చంగా ఫేక్ వార్తనే అని అనుకుంటారు. కానీ అలా తెలిసి కూడా దీన్ని సపోర్టు చేసే ఓ సెక్షన్ వీటిని తమ వాళ్లపై షేర్‌లు చేసుకుంటూ తమ పైత్యపు రాతల కామెంట్లను జోడిస్తూ పోతున్నారు. ఇలా నడుస్తోంది కొద్ది రోజులుగా. ఇక్కడ రెండు పార్టీల గురించే మనం మాట్లాడుకునేది. బీఆరెస్‌పై కాంగ్రెస్ సోషల్ మీడియా దాడి మరీ అదుపుతప్పి చీప్‌గా దిగజారి పోయి మరీ పెడుతున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్‌కు కేటీఆర్ అక్రమ సంబంధం అంటగట్టే వార్త నుంచి మొదలుపెట్టారు. ఇది ఇప్పటి దాకా కంటిన్యూ అవుతూ వస్తోంది. తాజాగా వచ్చిన ఫేక్ వార్తల చీప్ క్వాలిటీ కటింగ్ న్యూస్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సింది. అట్లాంటి క్షుద్ర రాజకీయమొకటి మొదలైంది తెలంగాణలో. ఇదెటు దారి తీస్తుందో తెలియదు కానీ. సక్రాంతి సినిమాలో వెంకటేశ్ డైలాగ్…మావోడు ఓటీటీ చూసి చెడిపోయి బూతులు మాట్లాడుతున్నాడు… అని కవరింగు ఇచ్చినట్టు. ఒకడు ఫేక్ వార్త పెడతాడు. ఇంకొకడు అమ్మనాబూతులు తిడతారు. ఈ పిచ్చి పీక్‌కు పోయింది. అసలు ఏది నిజమైన వార్తో కూడా తెలియక కొందరు జుట్టు పీక్కుంటున్నారు.
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో క్షుద్ర పూజలు చేస్తున్నాడని ఒకడు పైశాచికానందం పొందుతాడు. మళ్లీ ఆ చీప్ క్వాలిటీ ఫేక్ వార్తల బ్యాచే… ఎమ్మెల్యేకు వెయ్యి కోట్లు ఇస్తానన్నాడు కేసీఆర్.. ప్రభుత్వాన్ని కూలుస్తాడట.. అని పెట్టి శునకానందం పొందుతాడు. దీన్ని వెంటనే బీఆరెస్ సోషల్ మీడియా రంగంలోకి దిగి బూతులు తిట్టి.. బండకేసి కొడతాంరరయే అని వార్నింగ్ ఇచ్చి ఇది ఫేక్‌రోయ్ నమ్మకండని కోరుతారు. ఇలాంటి వార్తలతో కేసీఆర్‌కే కాదు తెలంగాణకే నష్టమని ఇంకొకడంటాడు. ఇప్పుడు ఎవడు ఎవడికోసం ఆలోచించడం లేదు. అలా రెచ్చిపోతున్నారంతే. వాస్తవానికి, బీఆరెస్ సోషల్ మీడియాకు కేటీఆర్ కోట్లు కుమ్మరిస్తున్నాడు. ప్రతీ అంశాన్ని విమర్శిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది.
కానీ మరీ చీప్‌గా అయితే లేదు. కాంగ్రెస్ సోషల్ మీడియానే. బరిబాతల బట్టలిప్పేసి ఊరేగుతున్నది అన్నట్టు పోతున్నది. సునీల్ కనుగోలు సారథ్యంలోనే ఇంత చీప్ వార్తలు, ఫేక్ వార్తల సృష్టి జరుగుతుందనే ఆరోపణలు కూడా బీఆరెస్ సెక్షన్ నుంచి వస్తున్నాయి. ఏకంగా బీఆరెస్ వీరిపై కేసులు పెట్టేదాకా వచ్చింది. జాగ్రత్తరోయ్.. ఇదే చివరి వార్నింగ్ బిడ్డా.. కేసులు పెట్టి లోపలేస్తం.. పరువు నష్టం దావా వేసి కోర్టుకీడుస్తం అని వార్నింగ్ ఇచ్చేదాకా పోయింది.