(దండుగుల శ్రీనివాస్)
సాఫ్ట్‌గా ఉంటే కుదరదు. సౌమ్యుడిగా పేరు గడిస్తే పదవులు దరి చేరవు. క్లాస్‌గా ఉంటే పట్టించుకోరు.. ఊర మాస్ అవతారమెత్తితే ఆకాశానికెత్తుతారు. పార్టీకి జవజీవాలు పోయాలంటే వార్తల్లో ఉండాలె. వార్తలకెక్కాలంటే తిట్టాలి. అవసరమైతే కొట్టాలి. తిట్టి కొట్టాలె. కొట్టుకుంటూ తిట్టాలె. తిట్టింది కరెక్టేనని వాదించాలె. కొట్టింది ధర్మం కోసమనే ట్యాగ్‌లైన్ వాడాలె. ఇప్పుడు అదే చేస్తున్నాడు కాబోయే బీజేపీ చీఫ్ ఈటల రాజేందర్. తాజాగా ఆయన వార్తల్లోకెక్కాడు. మామూలుగా కాదు. వైరల్‌గా. ఒకడి చెంప చెల్లుమనిపించాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది. దీన్ని సమర్థించుకున్నాడు ఈటల. ఇది కరెక్టేనన్నాడు. పైగా అది ధర్మం కూడా అని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు.
22Vastavam.in (3)-vastavam digital news paper
మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై తీవ్ర ఆరోపణలు చేశాడు. భట్టి భార్య ఏకంగా కమీషన్ల దుకాణం తెరిచిందంటూ ఆరోపణలు గుప్పించాడు. ఇలాంటి సీఎంను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని సీఎం రేవంత్‌పై దాడి కూడా మొదలు పెట్టాడు. హైడ్రా ప్రారంభంలో ఘాటు విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది కూడా ఈటల. ఆ దూకుడును ఇక పెంచుతూ పోతున్నాడు. ఇకపై తన వైఖరి మారనుందని.. ఇగ తిట్టుడు.. కొట్టుడేననే సంకేతాలిచ్చాడు ఈటల. బీజేపీ చీఫ్‌గా బండి సంజయ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి వైఖరే ఉండే. దూకుడుగా పోయేవాడు. ప్రతీ విషయంలో వేలుకాలు పెట్టి దాన్ని పెంట పెంట చేసి వార్తల్లోకెక్కేవాడు బండి.
మొత్తానికి బీజేపీ పార్టీ పేరును అంతటా వినిపించేలా చేయాలనే తపన, తనకు అధ్యక్ష పదవి ఇచ్చినందుకు పార్టీ రుణం ఈ విధంగా తీర్చుకుని దాన్ని బలోపేతం చేయాలని ఆత్రుత బండి సంజయ్‌లో కనిపించేది. ఆసమయంలోనే బీజేపీ పార్టీ పుంజుకున్నది కూడా. ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తున్నాడు ఈటల. ఇప్పటికే ఈటలకు నాస్తికుడు అనే బిరుదుంది. అలాంటి ఈయనకు బీజేపీ పగ్గాలెలా ఇస్తారబ్బా.. ? అని పార్టీలోనే చర్చ మొదలైన తరుణంలో తనకు ఇస్తే.. తనపై భరోసా ఉంచితే పార్టీని ఏడికో తీసుకుపోతా అనే సిగ్నల్ ఇస్తున్నాడు ఈటల. ఇక దూకుడు ఎలా ఉండబోతుందో చూడండి.. అనే విధంగా ట్రయలర్ రిలీజ్ చేశాడు.