(దండుగుల శ్రీనివాస్)
ఆ ఇద్దరి మధ్య ఆది నుంచి పసుపు బోర్డు రాజకీయం నువ్వా నేనా అనే రీతిలో కొనసాగుతూ వచ్చింది. తీరా పసుపుబోర్డు ఏర్పాటయ్యినంక కూడా కవిత.. అర్వింద్‌ను వదల్లేదు. బోర్డు తెచ్చిన క్రెడిటంతా కొట్టేద్దామనుకున్న అర్వింద్‌కు , జనాలకు తన పాత్ర గురించి గుర్తు తెచ్చారు. తెచ్చిన బోర్డు బోడిదేనని తేల్చి చెప్పారు. మద్దతు ధర ఇవ్వని ఆ బోర్డెందుకని ప్రశ్నించారు. ఇది పక్కా రాజకీయ అవసరాలకు వాడుకునే ఓ ప్రక్రియేనన్నారు పరోక్షంగా. తను పూటకో మాటగా మాట్లాడిన వీడియోలన్నీ బయటపెట్టి జనం ముందు ఇదీ సంగతి అని అని పాలకు పాలు నీళ్లకు నీళ్లుగా చెప్పుకొచ్చారు. ఈ రాజకీయానికి అప్పుడప్పుడే పుల్‌స్టాప్ పడదు.
అనామకుడిగా ఉన్న అర్వింద్ రాజకీయాలకు ఊతమిచ్చిందే పసుపు బోర్డు అంశం. అప్పట్నుంచి ఇప్పటిదాకా పసుపుబోర్డు గురించి రాజకీయాలు చేస్తూనే వచ్చాడు అర్వింద్. ఆనాడు మొదలైన రాజకీయల లొల్లి .. ఇప్పటిదాకా ఇలా నడస్తూనే ఉంది. ఇల్లు అలకగానే పండుగ కాదు… ముందు మద్దతు ధర 15వేలు ప్రకటించండి.. ఎగుమతులు ఆపండి… అంటూ కవిత ఇందూరు వేదికగా ఎంపీని నిలదీశారు. డిమాండ్లు ముందుంచారు. రాజకీయ అవసరాల తగ్గట్టు మాటలు మార్చుతూ వచ్చిన అర్వింద్.. తెచ్చిన ఈ పసుపుబోర్డు బోడిదేనని పరోక్షంగా ఆమె వ్యాఖ్యానించారు.