(దండుగుల శ్రీనివాస్)
సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతలను సెల్ప్ డిఫెన్స్‌లో పడేశాడు. తన ప్రసంగం ఆసాంతం బీజేపీ పెద్దలను పొగుడుతూనే.. వారి మద్దతు రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవసరం అన్నాడు. మోడీ సహకరించకపోతే ముందుకు పోలేమని కూడా తేల్చేశాడు. కేంద్రంతో సర్కార్ సయోధ్యతో ముందుకు సాగుతుందని, అదే సమయంలో ఇక్కడి బీజేపీ నేతలు కేంద్రం నుంచి రావాల్సిన సహకారాన్ని, నిధులను, అనుమతులను తెచ్చే విషయంలో పెద్దన్న పాత్ర పోషించడని కూడా కోరాడు. అంతే కాదు.. అలా మీరు తెచ్చిన నిధులు,జరిగిన అభివృద్ధిని మీ ఖాతాలోనే వేసుకోండి.. మీకే పేరు రావాలి.. నేను వెనుకుండి ఇదంతా చేస్తానని చెప్పుకొచ్చాడు.
సీఎంగా పాలనపరమైన నిర్ణయాలు మాత్రమే తాను తీసుకోగలుగుతానని, నిధులు లేనిదే అమలు చేయడం సాధ్యం కాదని, మీరంతా చేయి వేస్తేనే అది సాధ్యమని .. తరచూ ఇక మాపై పడకండి, విమర్శలకే పరిమితం కాకండి.. అభివృద్ధి కోసం మీరు చేయాల్సింది ఇదీ… చేస్తారా..? చెయ్యరా…? చెయ్యకపోతే జనాలే చూసుకుంటారు…!! అనే విధంగా సీఎం చేసిన కామెంట్స్ రాష్ట్ర పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు తెర తీసింది. కిషన్ రెడ్డిని గుజరాత్ గులామీ అని చడామడా తిట్టిపోసిన రేవంత్.. ఇప్పుడిలా బీజేపీ పెద్దలను నెత్తికొత్తికొని వారిబాధ్యతలను గుర్తు చేసి… మీ సహకారం కావాలె.. అని అడిగి.. తనవంతుగా చేయాల్సింది చేసేశాను.. ఇక వాళ్లే చేయడం లేదని జనం ముందు ఖుల్లంఖల్లాగా తేల్చి చెప్పే ప్రయత్నం చేశాడు. ఆదివారం తాజ్ క్రిష్ణలో ఉనిక పుస్తకావిష్కరణలో సీఎం ఏ . రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడాడు. బీజేపీ నేతల ముందు ఆయన పెట్టిన డిమాండ్లు, కోరికలు.. ఆయన మాటల్లోనే…..
నాకు భేషజాలు లేవు… తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా.. సహకారం తీసుకుంటా…తెలంగాణను వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ గా తయారు చేయడం కోసం సహకరించాలని ప్రధాని మోదీ ని కోరాను.. తెలంగాణలో 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది.. విశ్వనగరంగా హైదరాబాద్ మారాలంటే రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ కావాలని ప్రధాని మోదీని కోరారు.. తెలంగాణకు తీర ప్రాంతం లేదు కాబట్టి డ్రైపోర్టు ఇవ్వాలని అడిగాను.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ప్రధాని మోదీ సహకారం కోరాను..న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడదాం.. ప్రపంచం తో హైదరాబాద్ పోటీ పడాలంటే మెట్రో రైల్ కు అనుమతులు తెచ్చుకోవాలి..తమిళనాడు డీఎంకే ప్రభుత్వం ఉన్నప్పటికి అక్కడ మెట్రో కి ప్రధాని మోదీ సహకరించారు..కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ప్రధాని మోదీ బెంగళూరు కి మెట్రో ఇచ్చారు.. తెలంగాణ ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది..
కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నేత వినోద్ రావు లాంటి నాయకులు పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి.. కలిసి కట్టుగా తెలంగాణ కోసం పని చేయాలి.. తమిళనాడు లో వారి భాష కోసం, జల్లికట్టు కోసం పార్టీలకు అతీతంగా నాయకులంతా కలిసి పోరాడారు.రాబోయో కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో హైదరాబాద్ మెట్రో కు అనుమతి ఇస్తే బాగుంటుంది..విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడం కోసం 75 ఐటీఐల ను ఐటీసీలు మారుస్తున్నాం..2100 కోట్ల తో టాటా సంస్థ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడానికి ముందుకు వచ్చింది. యూనివర్సిటీ కోసం 600 కోట్ల కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నాం.. ప్రధాని మోదీ నుంచి అనుమతులు ఇప్పించగల్గే నాయకులు ఈ వేదికపై ఉన్నారు.. ప్రధాని ని కలిసి మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకుందాం..వన్ ట్రిలియన్ ఎకానమి గా తెలంగాణ ను తీర్చిదిద్దాలన్న కోరిక నాకుంది..