(దండుగుల శ్రీనివాస్)
ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ప్రతీకార రాజకీయాలు ఆంధ్రా నుంచి తెలంగాణకు బదిలీ అయ్యాయి. అక్కడ సీన్లు ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. కేటీఆర్ అరెస్టు ఉంటుందని భావించిన కొందరికి నిరాశ ఎదురుకాగా.. బీఆరెస్ శ్రేణులు మాత్రం సంబరాలు చేసుకున్నారు. విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. కానీ అప్పుడే అల్ప సంతోషులుగా సంబురాలు ఎందుకు..? రేవంత్ తలుచుకున్నాడు. పగ బట్టాడు. అరెస్టు ఇవాళ కాకపోతే రేపు.. కాని తప్పదు. ఆ విషయం పాపం వారికి తెలియదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సేమ్ అప్పుడు జగన్ చేస్తున్నట్టే.. ఇక్కడ రేవంత్ చేస్తున్నాడు. చంద్రబాబును అరెస్టు చేసే విషయంలో ఏదో పనికి రాని చిన్న కేసును ఆధారం చేసుకున్నాడు జగన్.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో భారీగా అవినీతి జరిగిందంటూ మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబును జైలుకు పంపించి పైశాచికానందం పొందాడు జగన్. కానీ అది చంద్రబాబుకే సింపతీ తెచ్చి పెట్టి మళ్లీ అధికారంలోకి తెచ్చి పెట్టింది. ఇక్కడ కూడా ఫార్మూలా-ఈ కార్ రేసింగ్ స్కామ్ కూడా పెద్ద కేసేం కాదు. కానీ జగన్ మాదిరిగా కేటీఆర్‌పై రేవంత్‌కు ప్రతీకారేచ్చ పెద్దది. తనను జైలుకు పంపిన కేసీఆర్, కేటీఆర్ అంతు చూడాలనే కసి మీదున్నాడు రేవంత్. అందుకే ఇప్పటికైతే ప్రశ్నించి వదిలేసినా.. మళ్లీ పిలుస్తారు. కటకటాల పాలు చేస్తారు. అందులో డౌట్‌లేదు. స్క్రిప్ట్‌లో చేంజ్ కూడా లేదు. ఈ పాటికే బీఆరెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. విజయోత్సవాలంటూ అతి కూడా చేస్తున్నారు.
కానీ అక్కడా ఇక్కడా ఆనాడు ఈనాడు జరిగిన పరిణామాలకు ఒక్కటే తేడా. ఏంటంటే..! ఆనాడు ఆంధ్రాలో జగన్ అనాలోచితంగా, కక్షసాధింపు చర్యలో భాగంగా చంద్రబాబును జైలు పాలు చేశాడు. కానీ అది ఎన్నికలకు ముందుగా. అక్కడే దెబ్బ పడింది జగన్‌కు. ఇక్కడ అలా కాదు. ఇంకా ఎన్నికలకు మూడున్నరేళ్లుంది. తనను జైలుకు పంపిన కేసీఆర్ ఫ్యామిలీ మీద కసి, పగ, ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే మంచి సమయం. ఇప్పుడు తన చేతికి చిక్కాడు కేటీఆర్. ఇక వదలేదే లేదంటున్నాడు రేవంత్. జైలుకు పంపడం పక్కా. కానీ ఒకవేళ కేటీఆర్ జైలుకు పోతే చంద్రబాబులా ఇక్కడ కూడా సింపతీ వస్తుందా..? రానీ. వస్తే రానీ. వస్తే తమకు పోయేదేం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలేమీ లేవు.
కేటీఆర్‌ను జైలుకు పంపడం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టమేమీ లేదు కూడా. అందుకే కేటీఆర్‌కు కటకటాలు తప్పవు. చిప్పకూడూ తప్పదు. ఇప్పుడు నడస్తుంది తెలంగాణ పగా, ప్రతీకారాల రాజకీయాలు.