వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్
సర్వం ఖర్చు పెట్టి తీసిన గేమ్ చేంజర్ మూవీ కోసం దిల్ రాజు చక్రం తిప్పాడు. సీఎం రేవంత్‌ను ఒప్పించాడు. గేమ్ చేంజర్ దిల్‌రాజేనని నిరూపించుకున్నాడు. పుష్ప-2 వివాదం నేపథ్యంలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ల రేట్లు పెంచుకోవడాలు ఇక లేవని తేల్చి చెప్పిన సీఎం.. మాట మార్చుకున్నాడు. మడమ తిప్పాడు. మళ్లీ బెనిఫిట్ షోలకు ఓకే అన్నాడు. టికెట్ రేట్లు ఎడాపెడా పెంచుకోవచ్చన్నాడు.
ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీనిపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. కాగా దిల్‌రాజు ఈ విషయంలో మాత్రం విజయం సాధించాడనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్‌కు ముందే నెగిటివ్ ప్రచారంతో దిల్ రాజు క్రుంగిపోయి ఉన్నాడు. భారీ బడ్జెట్. ఉన్నదంతా తీసి పెట్టాడు. ఇక విజయమో వీర స్వర్గమో అనే వీర లెవల్లో ఫోజిచ్చిన దిల్ రాజుకు… అల్లు అర్జున్ ఆటిట్యూడ్ తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
దీంతో తిక్కరేగిన సీఎం పుష్పను అరెస్టు చేయించేదాకా వదల్లేదు. అంతే కాదు ఇకపై మీకు బెనిఫిట్ షోలు ఉండవురోయ్.. అన్నాడు. టికెట్ రేట్ల విషయంలో కూడా ఒప్పుకునేది లేదని సీఎం అన్నాడని వార్తలొచ్చాయి. కానీ గేమ్ చేంజర్ సినిమాకు అన్నీ సానుకూలంగా చేసుకుని తనే గేమ్ చేంజర్ అయ్యాడు దిల్‌రాజు.