(దండుగుల శ్రీనివాస్)
ఎవ్వరినెప్పుడు ఆకాశానికెత్తుతుందో… ఎప్పుడు పాతాళానికి తొక్కేస్తుందో …! సోషల్ మీడియాకు మరో అంశం దొరికింది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు. మహా కుంభమేళాను మీడియా పట్టించుకోవడం లేదని చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. మెయిన్ మీడియా కు మేము పట్టడం లేదని తిట్టిపోస్తున్నారు. ఇది చాలదంటూ కొత్తగా ఈ కుంభమేళాలో ఓ పిల్లికళ్ల సుందరి మొత్తం టాపిక్ డైవర్షన్ చేసేసింది. దేశాన్ని తనవైపు తిప్పుకున్నది. మహా కుంభమేళాను లైట్ తీసుకున్న సోషల్ మీడియా ఆమె వెంట పరుగులు తీయడం మొదలుపెట్టింది. వెతికి వెతికి పట్టుకుని .. ఆ కళ్ల చుట్టూ గింకిర్లు కొడుతున్నది.
21Vastavam.in (vastavam digital paper)
పదారేళ్ల ఈ పాప ఇప్పుడు చిన్నా పెద్దా ముసలి ముతక తేడా లేకుండా అందరికీ ఆరాధ్యదైవమయిపోయింది. ఈ పాపను చూసి మురిసిపోతున్నారు. అబ్బ ఏం అందరా బాబు.. అని పొగడని నోరు లేదు. ఈ పోరి నవ్వులు చూసి చలించని మగ హృదయం లేదు.. అన్నట్టుగా ఆరాధించేశారు. ఆకాశానికెత్తేశారు. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన మోనాలిసా మహా కుంభమేళాకు వచ్చి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్నది. ఎవరో చూశారు. వీడియో తీశారు. పోస్టు చేశారు. అంతే తెగ వైరల్ అయిపోయింది. ఇక మీడియా మొత్తం ఆమెను కుంభమేళాలో వెతకడం ప్రారంభించింది. ఎక్కడ ఏ పిల్లికళ్లు కనిపించినా.. నువ్వేనా మోనాలిసా అంటూ ఆరాలు తీస్తూ వేట మొదలుపెట్టారు.
ఓ వైపు సంతోషం.. మరోవైపు ఈ మీడియా వేధింపులతో ఆమె తాళలేక ఉబ్బితబ్బిబ్బై.. ఇబ్బంది పడి.. పరేషానయి.. తన్మయంలో మునిగి తేలి.. ఊహాలోకాల్లో విహరించి.. మొత్తానికి తను మోడల్ కావాలనుకున్నానని అది ఇలా నిజమవుతున్నదని సంబరపడింది. కుంభమేళా అంతా ఓ వైపు.. మోనాలిసా ఓ వైపు అన్నట్టుగా మారిందక్కడ పరిస్థితి. ఇప్పుడు కుంభమేళాకు పోయేవాళ్లంతా ఈపిల్లికళ్ల పోరిని చూస్తందుకే పోతరేమో..!