(దండుగుల శ్రీనివాస్)
ఏం రాజేశ్వర్ ఇయ్యాల లేటుగా వచ్చినవ్ వాకింగ్ కు..
రాత్రి నిద్రలేదు కలాం సార్.. అందుకే పానం జర సుస్త్‌గుంది..!
సరే జర సేపు ఈడ కూసుందం….!
ఇక జెప్పు ఏందీ ముచ్చట్లు…!
ఆ ఏముంది సార్ అంతా లొట్టపీసు ముచ్చట్లు..!
ఏందీ నువ్వూ అంటున్నవా లొట్టపీసని…
ఏం ఎందుకనొద్దు… కేటీఆర్ నోట రోజు వందలసార్లు గిదే మాటొస్తుంది… కొన్ని రోజుల సంది..!
అది సంస్కారవంతమైన పదం కాదు రాజేశ్వర్ సాబ్..!
ఎందుకు..!
లొట్టపీసు అంటే వాస్తవానికి చెప్పాలంటే వృషణాలు అని అర్థం వస్తుంది. కిందకు వేలాడుతూ ఉంటాయి.. దేనికీ పనికిరావని అప్పట్లో అవగాహన లేక వాటిని అనేవారు..
మరి ఏదో మొక్క పేరంటున్నారు..!
అవును తూటికూర మొక్కలను కూడా కొందరు లొట్టపీసంటారు.. బేషరం మొక్కలని కూడా అంటరు..!
అవి ఏడబడితే ఆడ కాండం పడేసినా కొన్ని నీళ్లు పోస్తే మళ్లీ నాటుకుంటాయి.. అందుకే వాటిని బేషరం అంటారు.. కొన్ని చోట్ల తూటికూర చెట్లని కూడా అంటారు..
వాటితో అప్పుడు నీళ్లు కాచుకునేది. ఇప్పుడు వీటిని వాడటం లేదు కానీ చెరువుల సమీపంలో తూటికూర చెట్లు ఇప్పటికీ కనిపిస్తాయి…!
లొట్టపీసు అనేది మాటనా…? తిట్టా…?
అది ఒకరకంగా బూతుమాట. తిట్టు కూడా. విలువలేనోడివని. ఎందుకూ పనికి రానోడివని…
మరి ఆ మాట గ్రామీణ ప్రాంతాల్లో వాడుతనే ఉంటరు కదా..
వాడుతరు.. కానీ కేటీఆర్ లాంటోడు సంస్కారం కానీ మాట మాట్లాడితే ఉన్న సంస్కారం పోతది కదా..
మరి కేసీఆర్ ఆనాడు అసెంబ్లీలో ఉత్తమ్‌ను పట్టుకుని ప్రిపేరయి రాకపోతే పీకనికి వచ్చినవా అన్నాడు కదా…!
అది కూడా బూతే… వందేండ్ల కింద అవాంఛనీయ రోమాలు తీసుకునేందుకు పిడికెలను కాల్చి ఆ బూడిదకు ఆముదం కలిపి ఆ రోమాలు తొలగించుకునేవారు. నువ్వేం పీకలేవు అంటే నీకేం చాతకాదని అర్థం. కానీ అది కేసీఆర్ లాంటి నేతలు పలకడం కూడా సంస్కారం లేని విషయమే.
లెవ్వుండ్రి సార్.. జర వాగింగ్ చేద్దాం.. ఈ లొట్టపీసు మాటలతో మన టైం వేస్ట్ అవుతున్నది…