(దండుగుల శ్రీనివాస్)
మంత్రివర్గ మీటింగు తరువాత పెట్టే ప్రెస్‌మీట్ సుధీర్ఘంగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలపై సుధీర్ఘమైన వివరణలుంటాయి. అదీ సీఎం ప్రెస్‌మీట్ కదా. అంతా ఏదో ఊహించారు. కానీ సీఎం మాత్రం ఊహాజనిత కథనాలకు ఇక బ్రేక్ వేయండనే చురకతో మీడియా మీటింగు చాలు చేశాడు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టడం పెట్టడమే మీడియాపై చికాకు ప్రదర్శించారు. రైతు భరోసాపై మీడియా ఎవరికి వారే ఎవరికి తోచిన విధంగా వారు కథనాలు వండి వారుస్తున్నారని చురకలంటించాడు. ఇక మీ ఊహాలు ఆపండి. కల్పిత కథనాలకు కట్టేయండనే విధంగా హితోబోధ చేసి.. రైతు భరోసా పై క్లారిటీ ఇచ్చాడు. ఎవరెవరికి ఇస్తాం.. ఎవరికియ్యం అనే విషయాలపై అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టే చెప్పాడు.
కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బడా భూస్వాములకు ఇవ్వొద్దనే విషయాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. వ్యవసాయయోగ్యంగా ఉంటే చాలు ఆ భూములన్నింటికి ఎకరాకు ఏడాదికి 12వేలు ఇస్తామన్నాడు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి 12వేలు ఇస్తామన్నాడు. రేషన్‌కార్డులు కూడా జారీ చేస్తామన్నాడు. ఈ మూడు విషయాలే రాయండి.. పక్కదారి పట్టించకండి.. ఇవి చాలా కీలకం.. జనాలకు ఇవే విషయాలు చేరవేయండని బతిమాలుకున్నట్టే చెప్పాడు. చికాకును కూడా జోడించాడు. టూకీగా మాట్లాడి ముగించేశాడు.
అదేందీ..? మీడియా మొత్తం కాంగ్రెస్ జపమే చేస్తున్నది దాదాపుగా. సోషల్ మీడియా మాత్రమే కొంచెం అటీటుగా ఉన్నది. దీనికే రేవంత్ ముఖం చిట్లించాడు. చికాకును ప్రదర్శించి మీడియా వైఖరిపై కస్సుమన్నాడు పరోక్షంగా. సీఎం సారూ.. మీడియానెందుకు అట్ల అర్సుకుంటరు గానీ.. మీ వ్యవసాయ శాఖ మంత్రే రోజుకో ముచ్చట చెప్పి జనాలకు విపరీతంగా భయభ్రాంతులకు గురి చేశాడు. అటీటూ పోయి మీడియా మీద పడడమెందుకు అనుకుంటున్నారు మీడియా మిత్రులు.. సోషల్ మీడియా యాక్టివిస్టులు.