(దండుగుల శ్రీనివాస్)
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యాన్ని తీసుకుని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత చేపట్టిన ధర్నా రాజకీయంగా దుమారం రేపింది. కవిత చేపట్టిన ధర్నాపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు కవితపై ఆ పార్టీ పదేళ్లుగా బీసీల పట్ల వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్నాకు ఒకరోజు ముందే మహేశ్ కుమార్ గౌడ్ పదిహేను ప్రశ్నలతో కూడిన ప్రెస్‌నోట్‌ను విడుదల చేశాడు. తన ప్రశ్నలకు జవాబిచ్చిన తరువాత ధర్నా చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు తనకు ఇచ్చి బీసీలపై పార్టీ వైఖరి ఎలాంటిదో తెలియజెప్పిందని, మీరు మీ పార్టీ ప్రెసిడెంట్‌గా బీసీని నియమిస్తారా…? అంటూ కవితను , ఆపార్టీని సెల్ప్ డిఫెన్స్‌లో పడేశాడు మహేశ్. బీసీలపై ఏ పార్టీ వైఖరి ఎలాంటిదో తేల్చుకుందామని చర్చకు రా అని సవాల్ కూడా విసిరాడు. శుక్రవారం ఉదయం ధర్నా చేపట్టిన తరువాత మళ్లీ మహేశ్ కవితపై విరుచుకుపడ్డాడు. లిక్కర్ కేసు మరకను పోగొట్టుకనేందుక ఏదో బీసీ జపం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. మరోవైపు పొన్నం ప్రభాకర్ కూడా గాంధీభవన్ లో ప్రెస్‌మీట్ పెట్టి ఎంబీసీ, బీసీల ఊసెత్తిన కవితకు ధన్యవాదాలు తెలిపాడు.
ఇన్నాళ్లకైనా మేము గుర్తొచ్చామని ఆమె పక్కన ఉన్న బీసీ నేతలు అనుకుంటున్నారని, పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు వారిని కనీసం పట్టించుకోలేదని, నోరెత్తనీయలేదని విమర్శించాడు. సమగ్ర కుల గణన చేపట్టి బీసీలను కులాల వారీగా గుర్తించి ఎవరికేం ప్రాధాన్యత ఇవ్వాలో ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని స్పష్టం చేశాడు. ఈటల రాజేందర్‌ను తీవ్రంగా అవమానించి పార్టీ నుంచి గెంటేసిన ఉదంతాలు ఇంకా బీసీలు మరిచిపోలేదని ధ్వజమెత్తగా, మంత్రి సీతక్క కూడా కవితను గట్టిగానే అర్సుకున్నారు.