(దండుగుల శ్రీనివాస్)
అసెంబ్లీని మరీ రచ్చ రంబోలా చేసేశారబ్బా. అధికారం కోసం, ఈగో, ఫ్రస్ట్రేషన్ కోసం అసెంబ్లీని పుష్ప -2 థియేటర్ చేసేశారు. తోపులాటలు, పేపర్లు విసురుకోవడాలు, టికెట్ల కోసం తోపులాటల మాదరిగా స్పీకర్ చాంబర్ వద్దకు తోసుకుపోవడం.. యూజ్‌లెస్ ఫెలోస్ అనడం, మరొకరు చెప్పు చూపించడం… అబ్బబ్బ చెప్పొద్దు.. రోతకే కాక పుట్టించేలా తయారయ్యాయి మన అసెంబ్లీ తాజా సెషన్స్. కిష్కింధకాండను తలపించాయి.
అధికార పార్టీ తీసుకున్న చర్యలు సహజంగానే ప్రధాన ప్రతిపక్షానికి నచ్చలేదు. ముందే అధికారం కోల్పోయి తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇక అన్నీ స్కీములు మారుస్తున్నారు. అరెస్టులంటూ కొత్త కేసులు పెడుతున్నారు. అవినీతి అంటూ ఎఫ్ఐఆర్‌ల కోసం సర్చింగ్ మొదలు పెట్టారు. ఇవన్నీ సహజంగా చికాకును తెప్పించడమే కాదు తిక్కను లేపాయి. అందుకే బీఆరెస్ తిక్కతిక్కగానే ప్రవర్తించింది. ప్రధానంగా హరీశ్ ఈ గడిచిన సెషన్స్‌లో పూర్తిగా కంట్రోల్ తప్పాడు. ఏం చేస్తున్నాడో..! ఏం మాట్లాడుతున్నాడో కూడా సోయిలేని స్థితిలో ఆయన తీరు ఉంది. సభ్యులు తాగి వస్తున్నారని హరీశ్‌చేసిన కామెంట్స్ అసెంబ్లీ పరువునే దిగజార్చేలా ఉన్నాయి.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డినుద్దేశించి ఈ మాటలు అన్న హరీశ్.. సభ్యులందరినీ తాగుబోతులను చేసేశాడు. అప్పటి వరకు ప్రభుత్వాన్ని నడిపింది వీరేనా అనేలా హరీశ్, బీఆరెస్ సభ్యుల వైఖరి ఉంది. ఈ- ఫార్మూలా కార్ రేస్ కేసు విషయంలో చర్చకు పట్టుబట్టిన బీఆరెస్…వెల్‌లోకి దూసుకెళ్లేందుకు హరీశ్ అండ్ టీమ్ చేసిన ప్రయత్నాన్ని ఎవరూ మెచ్చుకోలేదు బీఆరెస్ సోషల్ మీడియా తప్ప. యూజ్‌లెస్ ఫెలో అంటూ ఓ సభ్యుడిని అర్సుకున్నాడు హరీశ్.
ఇక ఈ ఫార్మూలా కేసు చర్చకు స్పీకర్ అంగీకరికంచకపోవడం.. బీఆరెస్ సభ్యులు పేపర్లు చింపి విసిరేయడం.. ప్రతీగా కాంగ్రెస్ సభ్యులు కూడా పేపర్లు చింపి వారి మీదకు విసిరేయడం.. ఇలా జరిగిపోయింది. మధ్యలో నేనేం తక్కువ తిన్నానా అన్నట్టుగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చెప్పు చూపించడం ఓహో అద్బుతం. కనువిందు. కంటికి ఇంపుగా.. వీనుల విందుగా ఇలా సాగిందన్నమాట అసెంబ్లీ.