(దండుగుల శ్రీనివాస్)
అల్లు అర్జున్‌ను ఎర్రిపుష్పం చేశాడు సీఎం రేవంత్. అసెంబ్లీ సాక్షిగా పుష్ఫ-2 రిలీజ్ నాడు జరిగిన దుర్ఘటనలో ఓ తల్లి చనిపోవడం, ఆమె తనయుడు చావుబతుకుల మధ్య నెలరోజులుగా ఆస్పత్రి పాలుకావడం ఉదందాన్ని ఉటంకిస్తూ .. సెలబ్రిటీల తీరును సిగ్గులేని చర్యగా అభివర్ణించాడు. పనిలో పనిగా కేటీఆర్‌ను ఓ చూపు చూసుకున్నాడు.
గట్టిగానే అర్సుకున్నాడు. ఉద్యమ సమయంలో అసలు షూటింగే జరపనియ్యమని నిర్ణయాలు తీసుకున్నది వీరేనా… ఈ పదేళ్లుగా అధికారంలో ఉండి ప్రజల గురించి ఆలోచించింది ఇంతేనా..? అని తిట్టదండకం అందుకున్నాడు. అల్లు అర్జున్‌కు కాలు విరిగిందా..? చేయి విరిగిందా..? అంతలా ఎగబడి మరీ పరామర్శలు గుప్పించడం ఎందుకు..? ఓ ప్రాణం పోయి.. మరో ప్రాణం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఇదేనా మీ మానవత్వం అంటూ నిలదీశాడు. ఆ కుటుంబం సంపాదన ఎంత..? వారు టికెట్ల కోసం వెచ్చించింది ఎంత..? మరి అలాంటి వీరాభిమాన ఫ్యామిలీ ప్రాణాలు పోతే కనీసం పలుకరించరా..? అని కడిగేశాడు అసెంబ్లీ సాక్షిగా.
సినీ ఇండస్ట్రీపై తమకేమీ పగలు, ప్రతీకారాలు లేవని, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతిచ్చింది మేమే కదా ..? మాకెందుకు వారిపై కక్ష…? పోలీసులు చట్టపరంగా చేయాల్సింది చేశారు. ఇంకా ,చేయాల్సింది ఉంది. దీనిపై అల్లు అర్జున్‌కు శిక్ష తప్పదు అనే విధంగా సీఎం వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.