(దండుగుల శ్రీనివాస్)
కేటీఆర్ అరెస్టుపై మాట మార్చింది బీఆరెస్. కేటీఆర్ సహా అంతా కమాన్ అరెస్ట్.. కమాన్ అరెస్ట్ అని రెచ్చగొట్టి కాలుదువ్వి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదుకాగానే నాలుక మడతెట్టేశారు. యూటర్న్ తీసుకున్నారు. హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టడం దాకా ఓకే కానీ, అక్కడ ప్రవర్తించిన తీరు ఏమాత్రం మెచ్చుకోలుగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటి వరకు సభ ఆసాంతం జరిగిన తీరులో హరీశ్‌రావు పాత్ర కొంచెం దిగజారీ చీప్ అయ్యిందనే చెప్పాలి. ఇక ఈ-ఫార్మూలా కార్ రేస్ కేసు విషయంలో హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించగా.. ఏసీబీ విచారణకు ఓకే అన్నది.
ఎఫ్ఐఆర్ వద్దని వీరంటే.. నో చెప్పింది కోర్టు. ఈనెల 30 వరకు అరెస్టు చేయవద్దన్నది. ఇంతోటిదానికే బీఆరెస్ సోషల్ మీడియా .. రేవంత్ కు షాక్ అని… బీఆరెస్‌కు ఊరట.. కేటీఆర్‌కు హైకోర్టు ఊరట.. అంటూ ఊకదంపుడు పోస్టులు తెగ పెట్టేశారు.అవును.. ఆ ఊరట 30 వరకు. మరి ఆ తర్వాత. మరీ ఇంత అల్పసంతోషులయ్యారెంటి బ్రో మీరు. అరెస్టు చేస్తే మా బాస్ సీఎం అవుతాడు. ఇది మంచి శుభసూచకమని అంతా ముక్తకంఠంతో నొక్కి వాక్కాణించారు. కేటీఆర్ అయితే నేను యోగా చేస్తా.. ట్రిమ్‌గా తయారయితా.. స్లిమ్‌గా అందంగా మారుతా… ఇక పాద్రయాత్రే పాదయాత్ర అన్నాడు. మరేమైంది. హైకోర్టుకు పోయారే అనుకో. కోర్టు ఎఫ్ఐఆర్ విషయంలో, ఏసీబీ విచారణ విషయంలో సర్కార్‌ను ప్రొసీడ్ అన్నది.
అరెస్టు మాత్రం ఓ పది రోజులు ఆగి చేసుకోమన్నది. అంతే. దీనికే ఇక కేటీఆర్ నైతికంగా ఈ కేసు విషయంలో గెలిచాడు. ఇక అరెస్టే ఉండబోదు.. అనే రేంజ్‌లో కుమ్మరించేశారు తమ అభిమానాన్ని. మొన్నటి దాకా కేటీఆర్ అరెస్టయ్యితే పార్టీకి మైలేజీ వస్తుందని లెక్కలేసుకున్న వీరే.. ఇప్పుడు తత్తరపాటుకు గురవుతున్నారు. అయోమయంగా దిక్కులు చూస్తున్నారు. ఈడీ కూడా దీంట్లో ఎంట్రీ కావడంతో ఈ కేసు మరింత జఠిలంగా మారే అవకాశం ఉంది బీఆరెస్ కు. దీంతో కొంత భయాందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితం కావడం.. కేటీఆర్ మొత్తం భుజానేసుకుని పార్టీని నడిపించడం.. కవిత ఈ మధ్యే యాక్టివ్ కావడం.. ఇవన్నీ కూడా పార్టీలో కొత్త చర్చకు తెర తీశాయి.
ఇంకా నాలుగేండ్లు బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఎక్కడా తగ్గొద్దు. వీక్ కావొద్దు. ఈ మొదటి ఏడాది ఇంతలా రెచ్చిపోయి.. ఆ తరువాత చల్లబడుతూ వస్తే మరింత నష్టం. ఇప్పటికే కాంగ్రెస్ నష్ట నివారణకు దిగుతోంది. మున్ముందు మరింతగా ప్రజలకు చేరువయి.. ఇప్పటి వరకు ప్రోది చేసుకున్న వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కేటీఆర్ అరెస్టు.. ఈడీ ఎంట్రీ.. యువనేత జైలు పాలుకావడం, పార్టీకి దిశానిర్దేశం చూపే వారు లేకపోవడం.. ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.