వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: ఉద్యోగులపై దాడులు చేయడం, దుషణలు చేయడం, బెదిరింపులకు పాల్పడడాన్ని ఏమాత్రం సహించేంది లేదని, ఉద్యోగులను టార్గెట్ చేసేవారిని తాము కూడా టార్గెట్ చేస్తామని టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. . శనివారం టీజీఓ భవన్‌లో విస్తత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల అంశాలు, సమస్యలపై చర్చించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగ సంఘాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, ఉద్యోగుల సమస్యలపై చర్చించి ప్రస్తావించే అవకాశమే లేకుండా పోయిందన్నారు. ఇప్పుడిప్పుడే ఉద్యోగులంతా ఏకతాటిపైకి వచ్చి సమస్యలు ఏకరువు పెడుతున్నారన్నారు.
ప్రభుత్వ విభాగాల్లో సీనియర్ అధికారులు రిటైర్మెంట్ అయితే వారిని కొనసాగింపు పద్దతి కాకుండా పునర్ నియామకం చేయాలని, అలా చేయకుంటే శాఖలో సీనియర్లకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ఇప్పటికే ఉద్యోగులు ఒక పీఆర్సీ నష్టపోయారన్నారు. జిల్లా స్థాయిలో కొందరు అధికారులు ఉద్యోగులు, సంఘాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగుల సమస్యలను సైతం వినని స్థితిలో ఒకరిద్దరు అధికారులున్నారని, వారి పేర్లతో సహా లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రి, సీఎస్ దష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో టీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, 33జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.