వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
సిరిసిల్ల కలెక్టర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగిన బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. శనివారం నాంపల్లిలోని సీసీఎల్‌ఏ కార్యాలయ ఆవరణలోని తెలంగాణ తహసీల్ధార్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆ సంఘ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లచ్చిరెడ్డి మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఇటీవల కలెక్టర్ స్థాయి అధికారి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయని, దాడులు చేసిన వారిని ప్రోత్సహించేలా కొందరు వ్యవహరిస్తున్నారని పరోక్షంగా బీఆర్‌ఎస్ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానంగా రెవెన్యూ సంబంధిత ఉద్యోగులపై దాడులు జరుగుతున్నాయన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నమస్తే తెలంగాణ పేపర్లో ధర్మగంట పేరిట చేసిన కార్యక్రమాలకు రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, ఒక తహసీల్ధార్‌ను ఏకంగా కార్యాలయంలోనే పెట్రోలు పోసి నిప్పంటిస్తే కనీసం పరామర్శ కూడా చేయలేదన్నారు. రెవెన్యూ యంత్రాంగాన్ని అస్తవ్యస్తం చేశారన్నారు. లగచర్ల, దిలావర్‌పూర్ తదితర ప్రాంతాల్లో జరిగిన దాడులు సరికాదన్నారు. రాజకీయాలకు ఉద్యోగులను బలి చేయడం తగదని, ఉద్యోగులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటారన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ఉద్యోగుల ద్వారా ప్రజలకు చేరుతాయన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా… ఉద్యోగులు ఆ ప్రభుత్వానికి అండగా నిలిచి పనిచేస్తారన్నారు. ఉద్యోగులపై దాడులను ప్రోత్సహిస్తున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. రాములు, జనరల్ సెక్రటరీ రమేశ్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్, ఉమెన్ ప్రెసిడెంట్( అసోసియేషన్ ఉమెన్ వింగ్) రాధ తదితరులు పాల్గొన్నారు.