(దండుగుల శ్రీనివాస్)
రైతు భరోసా ఇంకా ఇవ్వలేదనే అసంతృప్తి రైతుల్లో ఉంది. ఇవ్వాళ, రేపు, దసరాకు, దీపావళి… ఇలా ఇప్పుడు సంక్రాంతి వరకు వచ్చింది విషయం. సంక్రాంతి లోపు విధివిధానాలపై ఓ క్లారిటీ రాగానే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక్కడ ఒకమాట చెప్పుకోవాలి. వ్యవసాయ శాఖ మంత్రి రైతు భరోసా గురించి, పొంగులేటి కేటీఆర్ అరెస్టు గురించి చెబితే ఇక జనాలు నమ్మేలా లేరు. ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాల్సిందే. అలా అయ్యింది పరిస్థితి.
ఇప్పుడు అసలు టాపిక్ కు వద్దాం. రైతు భరోసా ఇంకా రాకపోవడం.. ప్రతిపక్షాలు దీన్ని బాగా హైలెట్ చేయడంతో ఇటు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో పాటు రైతుల్లో కూడా ఈ విషయంలో అసంతృప్తి పెరుగుతూ వస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల హామీలో భాగంగా సన్న వడ్లకు క్వింటాకు బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పిన మాటలను చేతల్లో చూపుతోంది సర్కార్. ఇందులో ఇంకో విషయమేమిటంటే… ఈ బోనస్ ఇస్తున్న విషయాన్ని సర్కార్ పెద్దగా ప్రచారం చేసుకోకపోవడం. నేతలెవ్వరూ కూడా దీనిపై పెద్దగా మాట్లాడకపోవడం.
చాలీచాలని నిధుల కారణంగా మధ్యలో బోనస్ ఆగిపోతుందా..? పూర్తిగా ఇస్తామా ఇవ్వమా అనే అనుమానమా మరేదో తెలియదు కానీ.. ఈ బోనస్ విషయంలో విస్తృత ప్రచారంచేసుకోవడంలో సర్కార్ విఫలమైంది. కానీ లబ్దిపొందిన రైతులు మాత్రం ఖుషీగానే ఉన్నారు. రైతు భరోసా రాకపోయినా.. లేటుగా ఇస్తామని చెప్పినా.. కనీసం ఈ సాయమన్నా చేసి మమ్మల్ని ఆదుకుంటున్నారనే ఫీలింగ్ రైతుల్లో ఉంది. ఎకరాకు 12 వేల బోనస్ ఇస్తోంది సర్కార్. ఇది ఎంతో సాయంగా, రైతు పెట్టుబడికి ఊతంగా నిలుస్తోంది. ఈ బోనస్ అమౌంట్ రైతుల ఖాతాల్లో పడగానే వారికి సపరేట్‌గా మెసేజ్ వస్తోంది.
ఇది మీ బోనస్ మొత్తం అమౌంట్ అని సీఎం పేరు మీద, వ్యవసాయ శాఖ మంత్రి పేరు మీద ఆ మెసేజ్ రావడంతో రైతులకు స్పష్టంగా అర్థమవుతోంది. తమకు ఎంఎస్‌పీ కాకుండా అదనంగా సర్కార్ ఇచ్చే బోనస్ కలుపుకుంటే ఎంత వరకు లాభం వచ్చింది. ఒక ఎకరాకు ఎంత మేర బోనస్ తమకు సహాయకారిగా నిలుస్తోంది అని. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి కూడా స్పందించారు. ఇవాళ ఈనాడులో వచ్చిన దీనికి సబంధించిన పాజిటివ్ వార్త క్లిప్పింగును వాడుకుని తన ఎక్స్‌లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. 1.53 కోట్ల టన్నుల వరి ధాన్యం పండించి దేశానికి అన్నపూర్ణగా తెలంగాణను నిలబెట్టిన రైతన్నకు ప్రజా ప్రభుత్వం ఇస్తోన్న ప్రోత్సాహం ఇది… ఎకరాకు రూ. 12వేల బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవ సాయా న్ని పండగ చేసే ఈ ప్రయత్నం నాకు గొప్ప తృప్తిని ఇస్తోంది.. జై కిసాన్ అని ఆయన పోస్టు చేశారు.