(దండుగుల శ్రీనివాస్)
అధికారం రాగానే అంతా మారుతారంటారు. దీనికి ఎవరూ మినహాయింపు కాదేమో అనిపిస్తుంది. అప్పటి వరకు కేసీఆర్ ను చూసిన వాళ్లు.. తెలంగాణ వచ్చినంక ఆయనలోని మరో మనిషిని చూశారు. ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి.. ఇక మాది ఫక్తు రాజకీయ పార్టీ అని.. రాజకీయ పునరేకీకరణ అని కలుషిత రాజకీయాల్లో మరింత విషం నింపాడు. ఎవరైతే గంపెడాశలు పెట్టుకున్నారో వారి కంట్లో మన్నుకొట్టాడు. ఏమైనా అంటే కేసీఆర్ ఏమి చేసినా అంతా తెలంగాణ కోసమే అనే బిల్డప్ ఒకటి ఇస్తూ వచ్చారు. బీజేపీ నేతలు.. మోడీ, షాల ద్వయం ఏమి చేసినా దేశం కోసం, ధర్మం కోసం అని కలరింగు ఇచ్చుకున్నట్టు. సిట్టింగులకు పెంచి పోషించాడు కేసీఆర్.
వాళ్ల అరచకాలు, అవినీతి కళ్లకు కనిపించినా గుడ్డోని లెక్కనే వ్యవహరించాడు. మళ్లీ మళ్లీ వాళ్లకే ఇచ్చాడు. ప్రజలను పిచ్చోళ్లలా భావించాడు. తనపై గుడ్డి నమ్మకం పెట్టుకున్నారు గెలిపించి తీరుతారని భ్రమపడ్డాడు. ఉద్యమకారుల జీవితాలను రోడ్డు పాలు చేశాడు. కరుడుగట్టిన కార్యకర్తల జీవితాల్లో విషాదాన్నే మిగిల్చాడు. ఇది సరిపోలేదని పోలోమని దేశాన్ని ఉద్దరించేందుకు పార్టీ పేరులోని తెలంగాణనే కాలగర్బంలో కలిపేసుకున్నాడు. బీఆరెస్ అని నామకరణం చేసి.. ఇక్కడంతా బాగు చేసిన.. ఇక దేశాన్ని ఏలుతా అని బయలుదేరాడు.
ఇక్కడి సొమ్మంతా మరాఠాలకు మింగబెట్టాడు. ఎక్కడో రైతులు చనిపోతే ఇక్కడి పైసలు తీసుకపోయి ఇచ్చి శభాష్ కేసీఆర్ అని దేశమంతా మెచ్చుకోవాలని అంగలార్చాడు. కీర్తికండూతి మరీ అంత పీక్‌లో ఉంద కాబట్టే ఇలా మట్టికొట్టుకుపోయాడు. అయినా మారలేదు. ఆ అహంకారం వీడలేదు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లకు మళ్లీ క్యాడర్ గుర్తొచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ యాదికొచ్చింది. దీక్షాదివస్ అంటూ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇదెంత మంది జనాలకు గుర్తుంది. తెలంగాణ ఏర్పాటు , రాష్ట్రం వచ్చిన తరువాత ఎంతగా మారాయి జనాల బ్రతుకులు అని లెక్కలేసుకున్నప్పుడు.. చెప్పుకోవడానికి ఏమీ లేదు.
మరలాంటప్పుడు దీక్షాదివస్ ను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలా…? నువ్వన్న బంగారు తెలంగాణ వచ్చిందా.. రావాలంటే ఇంకెన్ని టర్ములు నిన్ను సీఎం చేయాలి…? నీకొడుకును సీఎం చేయాలి..? నిన్ను, నీ అవినీతి ఎమ్మెల్యేలను ఇంకెన్ని సార్లు నెత్తిన పెట్టుకొని ఊరెగాలి…? మీ బతుకులు పచ్చగుండెలె…. పేదోడి బతుకు రోడ్డు పాలు కావాలె..! అదే మీరు చేసింది. అంతే మీ ఆలోచనలు. ఇంకా మారలేదు. మారుతారనే నమ్మకం కూడా జనాలకు లేదు. ఇప్పుడు దీక్షాదివస్‌లో పాల్గొనేవాళ్లంతా కరుడుగట్టిన బీఆరెస్ కార్యకర్తలు, ఉద్యమకారులే. వీళ్లంతా ఇకనైనా కేసీఆర్ మారి.. మాకేమైనా అవకాశాలిస్తాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్నవారే. కానీ వాడుకుని వదిలేసేరకం కేసీఆర్. ఎందుకంటే తను ఫక్తు రాజకీయం తెలిసినవాడు కాబట్టి.