వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌-గుండంపల్లి గ్రామాల మధ్య చేపట్టిన ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా మంగళవారం రెండు గ్రామాల వారు 61వ జాతీయ రహదారిపై బైఠాయించటం తో జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో, నిరసనకారులతో మాట్లాడేందుకు దిలావర్‌పూర్‌కు వచ్చిన ఆర్డీవోని నిరసకారులు నిర్భందించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు ట్రెసా (తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్) రాష్ట్ర అధ్య‌క్షుడు వంగ ర‌వీంద‌ర్‌రెడ్డి. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. నిర్మల్ ఆర్డీవో తిరిగి వెళ్లే క్రమంలో కారులో ఎక్కేందుకు ప్రయత్నించగా నిరసకారులు అడ్డుకోవడం, ఆర్డీవో రాత్రి వరకు కారులోనే ఉండాల్సి రావడం తమకెంతో ఆవేదన గురిచేస్తోంద‌న్నారు. తర్వాత నిర్మల్ ఆర్డీవో ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి 9 గంటలకు వైద్యులు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించే పరిస్థితి రావడం పట్ల ఉద్యోగులందరూ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రాత్రి 10 గంటల వరకు నిరసనకారుల నిర్బంధంలో ఉన్న ఆర్డీవోని విడిపించేందుకు పోలీసులు వలయంగా ఏర్పడి తీసుకెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో ఆందోళనకారులు ఆర్డీవో కారును ధ్వంసం చేయడం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. పోలీసులు అతి కష్టమ్మీద ఆర్డీవోను పోలీసు వాహనంలో నిర్మల్‌కు తరలించే పరిస్థితి రావడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇటువంటి సంఘటనలు పదేపదే జరగడం ఉద్యోగుల మనో స్తైర్యాన్ని దెబ్బ తీస్తుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రాజెక్టులపై ఉన్న వ్యతిరేకతను రెవెన్యూ ఉద్యోగులపై ప్రదర్శించడం సముచిత పద్ధతి కాదని తెలియజేస్తున్నామ‌ని పేర్కొన్నారు. తమ నిరసనను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. సంఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

You missed