(దండుగుల శ్రీనివాస్)
తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయడం ద్వారా తన హయాంలో ఓ గుర్తింపు ఉంటుందని భావించాడు సీఎం రేవంత్. ముచ్చర్ల వద్ద వేలకు వేలు గత సర్కార్ ఫార్మా సిటీ కోసం భూములు కొనుగోలు చేసిపెట్టినా.. దాన్ని రియల్ రంగానికే పరిమితంచేయనున్నాడు. ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడా తన కంటూ ఓ ముద్ర వేసుకోవాలని చూస్తున్న రేవంత్.. ఆ ఫార్మా సిటీని తన కొడంగల్ నియోజకవర్గానికి తరలించి అభివృద్ధి చేసుకోవచ్చని భావించాడు. కానీ అక్కడ పరిస్థితి తిరగబడ్డది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముందే అక్కడి పరిస్థితి వివరించినా సీఎం వినలేదు. మొండిగా ముందుకే పోయాడు.
సీఎం అయినప్పటి నుంచి ఆయన వైఖరి అన్ని విధానాల్లో అలాగే ఉంది. ఎవరు చెప్పినా వినడం లేదు. ఆ మాటకొస్తే కేసీఆర్‌లాగా ఎవరి సలహాలు తీసుకోవడం లేదు. అంతా తనకే తెలుసుననే దోరణిలోనే పోతున్నాడు. చాలా సంద ర్బాల్లో ఇదే వైఖరి ఆయనకు, పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బంది, నష్టం తెచ్చిపెట్టినా వినలేదు. హైడ్రాపై కొంచెం వెనక్కి తగ్గాడు. మూసీ వెంట పడ్డాడు. ఇక రాష్ట్రంలో ఏ సమస్యాలేనట్టు.. ఈ మూసీ ఒక్కటి బాగు చేస్తే రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉంటారనే లెవల్లో ఆ మురికి కాలువ వెంట పరుగులు తీస్తున్నాడు. ఇక ఇప్పుడు లగచర్ల విషయంలో భూసేకరణ పేరుతో లంబాడాలతో పెట్టుకున్నాడు. వారంతా అధికారులపైనే దాడికి తెగపడే దాకా పరిస్తితి వచ్చింది. అరెస్టుల చాలానే చేశారు. ఇంకా చేస్తున్నారు. జైలుకు పంపుతున్నారు.
ఎంత చేసినా.. ఎంత భయపెట్టినా.. లంబాడీలు ఆ భూములు ఇచ్చే పరిస్థితిలో లేరు. దీన్ని బీఆరెస్ అందిపుచ్చుకుంటుంది. రాజకీయంగా మైలేజీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. దీంతో ఇక దీనిపై వెనక్కి తగ్గడం మేలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఫార్మా సిటీ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై మళ్లీ రాజకీయంగా ఓ చర్చకు తెరలేవనుంది.