వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

వికారాబాద్ జిల్లాలో అధికారుల‌పై జరిగిన దాడిని ఉద్యోగులే కాకుండా రాజ‌కీయాల‌కు అతీతంగా అంద‌రూ కూడా ఖండించాల‌ని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి కోరారు. అధికారం లేక‌నో, లేదా అధికారం కోస‌మో, లేదా ఉద్యోగుల‌పై దాడికి ప్రేరేపించ‌డం, చేయించ‌డం స‌రైన చ‌ర్య కాద‌న్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులంద‌రూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, అన్ని రాజ‌కీయ పార్టీల‌కు స‌మాన‌మేనన్నారు. కానీ, అధికారుల‌పై జ‌రిగిన దాడిని మాత్రం ఖండించ‌క‌పోగా, దాడికి పాల్ప‌డిన వారిని ప‌రామ‌ర్శించ‌డం ప్ర‌జాస్వామ్యానికే అవ‌మాన‌క‌రంగా మారే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇప్పుడే కాదు, భ‌విష్య‌త్తులోనూ జ‌రుగొద్ద‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ దాడి ఒక‌రిద్ద‌రు అధికారుల‌పై లేదా రెవెన్యూ శాఖాధికారుల‌పై జ‌రిగిన దాడిగా చూడటం లేద‌న్నారు. తెలంగాణ‌లోని యావ‌త్తు ఉద్యోగ లోకంపై జ‌రిగిన దాడిగా భావిస్తున్న‌ట్టుగా తెలిపారు. ఇదే అంశ‌మై బుధ‌వారం హైద‌రాబాద్‌లో జరిగిన‌ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అత్య‌వ‌స‌ర స‌మావేశంలో తీసుకున్న‌ ప‌లు నిర్ణ‌యాలను ప్ర‌క‌టించారు.

14.11.2024న రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని క‌లెక్ట‌రేట్ల ముందు భోజ‌న విరామ స‌మ‌యంలో న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి నిర‌స‌నలు, ధ‌ర్నాలు చేప‌ట్టాల‌ని ల‌చ్చిరెడ్డి పిలుపునిచ్చారు. అదే విధంగా రాష్ట్ర రాజ‌ధానిలోని హైద‌రాబాద్ క‌లెక్ట‌రేట్ వ‌ద్ద జ‌రిగే నిర‌స‌న‌, ధ‌ర్నా కార్య‌క్ర‌మం చేపట్ట‌నున్నట్టుగా తెలిపారు. మ‌ధ్యాహ్నం 12గంట‌ల‌కు జ‌రిగే నిర‌స‌న‌లు, ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో జేఏసీ రాష్ట్ర నాయ‌క‌త్వం పాల్గొనాల‌ని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగే నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు, ధ‌ర్నా కార్య‌క్ర‌మాల‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ‌, కార్మిక‌, పెన్ష‌నర్ల , సీపీఎస్‌, అవుట్ సోర్సింగ్‌, ఉద్యోగులు, సంఘాలు, జేఏసీ నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో పాల్గొని జ‌య‌ప్ర‌దం చేయాల‌ని ల‌చ్చిరెడ్డి పిలుపునిచ్చారు.

You missed