(దండుగుల శ్రీనివాస్)
అప్పుడెప్పుడో రేవంత్ అన్నాడు మీడియాతో. నాతో పెట్టుకుంటే మాములుగా ఉండదు. నా ప్లానింగ్ దిమ్మదిరిగేలా ఉంటుందని. ఆర్జీవీ డైరెక్షన్‌లా ఆగమాగం .. ప్రచారపటాటోపం లా కాకుండా… రాజమౌళి డైరెక్షన్‌లా పాన్ ఇండియా మూవీలా అందరినీ షేక్ చేసేలా ఉటుందని. సీఎం రేవంత్‌కు సినీ నాలెడ్డ్ కూడా బాగానే ఉందని అప్పుడే అర్థమయ్యింది. అంటే ఎవరి డైరెక్షన్ ఎలా ఉంటుంది..? ఎవరి డైరెక్షన్ అంటే జనం విరగబడి చూస్తారు.. ఎవరివి హిట్టు.. ఎవరివి ఫట్టు అనే విషయంలో మంచి క్లారిటీ ఉందనిపించింది.
అంతకు ముందెప్పుడో తనకు సూపర్ స్టార్ క్రిష్ట అంటే అభిమానమని, ఆ హీరో సినిమాలు ఇంట్రస్టుగా మొదటి రోజే చూసేవాడనని కూడా చెప్పినట్టు గుర్తు. ఇప్పుడు సినిమాలంటే అంత ఇంట్రస్టు లేదని చెప్పుకొచ్చిన ఆయన.. ఈ డైరెక్షన్‌ల విషయంలో.. డైరెక్టర్ల పనితనం విషయంలో మాత్రం బాగానే స్టడీ చేసినట్టున్నాడు. ఫాలో అవుతున్నట్టున్నాడు. గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ రావుగోపాల్‌రావుకు ఓ ఊతపదం లాంటి డైలాగొకటి ఇచ్చారు. వార్నీ తస్సారవలా బొడ్డు.. ఇంటిమొగుడికెక్కువ.. రంకు మొగుడికి తక్కువ …. కన్నాంబకు ఎక్కువ కాంచనమాలకు తక్కువ….. ఇలాంటివి. బాగా ఫేమస్. అలా డైలాగులు చెప్పడంలో ఆ విలనీ పండింది. ఏదైనా పనిచేసేటప్పుడు ఇలా ఉదాహరణలు, పోలికలతో , ప్రాసలతో కలిపి డైలాగులు దంచితే అది హిట్టే అయి కూర్చుంటుంది. ఆకట్టుకునే తీరుతుంది. అలాంటిదే రేవంత్ ఈ డైరెక్టర్ల ప్రస్తావన తేవడం. ఇప్పుడీ సినిమా గోలెందుకు..? డైరెక్టర్ల లొల్లేలా అంటారా..! వస్తున్నా .. అక్కడికే..!
ఇప్పుడు రాజకీయమంతా రేవంత్, కేటీఆర్ చుట్టూ నడుస్తున్నాయి. మరిందులో రేవంత్ అన్నట్టుగా ఎవరు ఆర్జీవీ, ఎవరు రాజమౌళి..? అవును.. చెప్పడం మరిచాను. ఆర్జీవీ ట్రెండ్ సెట్టరే. కానీ ఒకప్పుడు. ఇప్పడంతా ప్రచారపటాటోపం.. ఏదో సినిమా చేయడం ద్వారా పొట్టపోసుకునే బాపతు అన్నమాట. ఆ డైరెక్షన్ తీరే రోత ఇప్పుడు. ఒకప్పుడు శివ ట్రెండ్ సెట్టర్. క్షణక్షణం, గోవిందా గోవిందా,. రంగీలా.. అనగనగా ఓ రోజు.. తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నవాడు.
కానీ ఇప్పుడు ఏదో ఒక వివాదం ముందేసుకుని.. సోషల్ మీడియాలో నేనున్నానురోయ్.. నన్నూ జర పట్టించుకోండనే రేంజ్‌కు దిగజారి పోయి.. వివాదస్పద విషయాలతో పొద్దు గడుపుతూ .. కాంట్రవర్సీ సినిమాలతో కడుపు నింపుకుంటూ ఎంజాయ్ చేసే ఓ విలాస, లాలస పురుష పుంగవుడు. డైరెక్టరన్నమాట. ఇక రాజమౌళి.. ఏదీ తొందరగా ముగించడు. ఏళ్లకు ఏళ్లు రీళ్లకు రీళ్లు చుడుతా ఉంటాడు. ఫైనల్‌గా మంచి రిపోర్టు. బాక్సాఫీసు బద్దలు కొట్టే కలెక్షన్లు. పాన్ ఇండియా వ్యాప్తంగా చర్చ. తెలుగు సినీ ఇండస్ట్రీకి గర్వకారణం. ఇదీ ఇద్దరి ముచ్చ. ఇప్పుడు మరి రేవంత్ అన్నట్టుగా రాజమౌళి తనే అయితే.. ఆర్జీవీ కేటీఆరా..?
వికరాబాద్ ఫార్మా లొల్లి అనే అట్టర్ ఫ్లాప్ సినిమా డైరెక్షన్ ద్వారా తనో ఆర్జీవీ అని నిరూపించుకున్నాడా..?
ఇంకా ముందుంది సినిమా అంటారా..?
చూద్దాం ఎవరి సినిమాలు ఎలా ఉంటాయో..? ఎవరి డైరెక్షన్ హిట్టో…
ఎవరు ఎవరికి సినిమా చూపిస్తారో…! వెయిట్ అండ్ సీ…