(దండుగుల శ్రీనివాస్)
చిన్నవయస్సులో సీఎం అయిన. అందరి ఆశీస్సులతో ఈ పదవి దక్కింది. నా జన్మదినం రోజున ఈ మూసీని ప్రక్షాళన చేసే మహాద్బుత కార్యక్రమం చేపట్టిన… నా జన్మ ధన్యమైంది. ఎవరడ్డొచ్చినా ఆపను. హరీశ్, కేటీఆర్‌లను బల్డోజర్లతో తొక్కైనా సరే ఈ పనులు చేపడతా…. అని సీఎంరేవంత్ ఘాటుగా స్పందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలో మూసీ నదీ పరివాహాక ప్రాంత ప్రజలతో కలిసి నడిచాడు రేవంత్. వారి బాధలు విన్నాడు.అక్కడే జరిగిన సభలో మాట్లాడాడు. హరీశ్, కేటీఆర్, కేసీఆర్‌లను బిల్లా, రంగా, చార్లెస్ శోభరాజ్‌లతో పోల్చాడు. వారికి సవాల్ విసిరాడు. జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి పాదయాత్ర చేస్తానని, వీరు కలిసి రావాలని సవాల్ విసిరారు.
కలిసి రాకుంటే రాయి కట్టి మూసీలో పడేస్తామన్నారు. తను దోచుకోవడానికి రాలేదన్న సీఎం… కేసీఆర్ కుటుంబం దోచుకున్నట్టుగా తాను దోచుకోవాలంటే ధరణిని అడ్డం పెట్టుకుని భూములు కొళ్ల గొట్టేవాణ్ణని పరోక్షంగా ధరణితో ఆ కుటుంబీకులు దోచుకుతిన్నారని చెప్పుకొచ్చాడాయన. మూసీలో గోదావరి జలాలు రప్పిస్తానని, నదుల సంగమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టబోతుందని చెప్పారు. ఇది ట్రయల్ మాత్రమేనన్న రేవంత్.. జనవరి మొదటి వారంలో తన పాదయాత్రతో అసలు సినిమా చూపిస్తానన్నారు. నల్లగొండలో బీఆరెస్‌ను ఘోరంగా ఓడించారని కేసీఆర్ ఇక్కడి ప్రజలపై కక్షగట్టాడని విమర్శించాడు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డినుద్దేశించి మూడు అడుగుల వాడు అంటూ ఎద్దేవా చేశాడు.
సీఎం హోదాలో మళ్లీ తన విశ్వరూపం చూపాడు రేవంత్. తన పాతశైలినే ప్రసంగంలో వాడాడు. ఆవేశంగా మాట్లాడాడు. అక్కడున్న జనానికి ఊపుతెప్పించాడు. ఎవరైనా జన్మదినం అంటే మందు, దావత్ తో సంతోషంగా ఉంటారని పరోక్షంగా తను మూసీలో తిరుగుతున్నానని, దీనికి ఎంతటి ప్రాధాన్యతనిస్తున్నానో అర్థం చేసుకోవాలని ప్రజలను సీఎం కోరారు.