(దండుగుల శ్రీనివాస్)
ఇదేం ఖర్మరా బై. మనం ఏం అనుకున్నం. ఏం జరుగుతున్నది. సీఎం రేవంత్ అయితే ఏం చేస్తాడని ఊహించాం.. కేసీఆర్‌కు మించి ఏం వస్తదని ఆశించాం. కానీ ఇప్పుడేమైతున్నది. మన సీఎం మూసి వెంట పడుతున్నడు. దానికి పునరుజ్జీవం పోస్తనంటున్నడు. ఆ మూరికి కూపం పక్కన ఉన్న జీవితాలకు విముక్తి కల్పిస్తానంటున్నడు. మంచిదే. మంచి ఆలోచనే. స్వయంగా తన పుట్టిన రోజున మూసీ మురికి నీటి పక్కన గడపడం కూడా ఓ మంచి ఆలోచనే. అక్కడి నుంచే తన కార్యక్రమానికి కూడా నాంది పలకాలని భావించడమూ ఓకే. పాదయాత్ర చేసి బాధలు తెలుసుకోవడం సబబే. కానీ అక్కడ ఓ సన్నివేశం చాలా ఎబ్బెట్టుగా అనిపించి డోకొచ్చింది ఈ రాజకీయాలకు. ఆ సీఎం ప్రవర్తనకు. ఆ వాతావరణానికి.
ఏం జరిగింది. గంగాజలంలో వదిలినట్టు మూసీ మురికి జలంలో పసుపు,కుంకుమ, పూలు జల్లుతున్న సీఎం రేవంత్‌ను చూసి అబ్బ నిజం చెప్పొద్దు జాలేసింది. ఎవరయ్యా నీకు వెనుకుండి సలహాలిస్తున్నది. వలిగొండ మండలం సంగెంలో మూసీ నదీ మధ్య భాగంలో చుట్టూ మురికి కూపంలో మన సీఎం చేసిన కార్యక్రమం ఇది. సీఎం అట్ల చేస్తేనే నీకు డోకొస్తుంది.. మరి అక్కడున్నోళ్ల సంగతేందీ..? అంటారా..? అవును అదీ కరెక్టే గానీ. మరీ ఇంతలా చేయడం ఓవర్‌గా లేదా బ్రదర్ నువ్వే నిజం చెప్పు.అగో బోట్‌లో కూడా ఎక్కాడురోయ్..!
పాపం.. రేవంతుకు పుట్టిన రోజునాడే ఇంతటి ఘోరమైన కార్యక్రమాల లిస్టును ఎవరు రచించారో కదా..! ఎక్కడో మూసీ పుట్టింది. ఆ పుట్టిన దగ్గరనే అంటే వికారాబాద్‌లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం మొత్తం కొలాప్స్ అయిపోయి… ఆ మురుగు మొత్తం మూసీలోకి వదిలాంట… దాని మీద చర్యలు లేవు. అక్కడి నుంచి మొదలుకొని హైదరాబాద్‌లోని మురికి, దొడ్డి మొత్తం ఈ నదిలోకే వదిలే. మరి దాని ఊసు లేదు.
పునరుజ్జీవం ఉత్తగనే అయితదా..? చాలా చేయాలె. అవన్నీ చేయకముందే… ఆ లాస్టు చివరాకరకు పోయి…. మురికి నీళ్లకు దండం పెట్టి పూలు జల్లి, పసుపు, కుంకుమ చల్లి… బాబోయ్.. ఆ నీటిని నెత్తిన పోసుకోలేదు బతికిపోయాం… నిజ్జంగా ఆ తెరవెనుక సలహాదారెవరో బతికించారు రాష్ట్ర ప్రజలను. ఏదేమైనా రేవంత్‌రెడ్డి తన బర్త్‌డేను ఇలా మురికి కూపంలో గడపడం మాత్రం నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్….!