(దండుగుల శ్రీనివాస్)
కేబినెట్ మీటింగు నాలుగ్గంటలు నడిచింది. ఆ తరువాత ప్రెస్‌మీట్ ఆలస్యంగా పెట్టారు. రాత్రి పదకొండు వరకు లాక్కొచ్చారు. కేబినెట్‌లో కొత్తదనమేమీ లేదు. ఖనానా ఖాళీగా ఉంటే నిర్ణయాలు కూడా అట్లనే ఉంటాయి మరి. అందుకే ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఉద్యోగులు కూడా రెండు డీఏలు వస్తాయనుకున్నారు. కానీ ఒక్కటితోనే సరిపెట్టారు. మార్చి తరువాత మరొకటి అన్నారు కానీ అనుమానమే. ఇక రైతు భరోసా , రుణమాఫీ సంపూర్ణంపై మాట్లాడలేదు.
ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రస్తావన వచ్చింది. కానీ అదీ ఇంతకు ముందు చేసిన ప్రకటనే. బీసీ కులగణన కు సబంధించి షెడ్యూల్ విడుదల ఇదీ పాతదే. రైస్ మిల్లర్ల ఆగడాలపై చర్యలు.. ఇదీ ఇంతకు ముందు వచ్చిన ప్రస్తావనే. ఇక మూసీపై ఇంత పంతంతో ఉన్న సర్కార్ దీంట్లో ఏమీ టాపిక్ తీయలేదు. హైడ్రా గురించీ లేదు. కానీ చివరలో మాత్రం విలేకరులు అడిగిన ప్రశ్నకు దీపావళికి ముందే బాంబులు పేలుతాయని మళ్లీ పొంగులేటి బాంబు పేల్చాడు. కేబినెట్ నిర్ణయాల్లో కొత్తదనమేమీ లేక ఉసూరుమంటున్న వారికి మాత్రం ఈ పొలిటికల్ బాంబు మళ్లీ చర్చకు తెరతీసింది.
అరెస్టు ఉంటుందా..? కేటీఆర్‌ను లోపలేస్తారా..? అంత ఈజీగా సాధ్యమవుతుందా..? ఏహె అంత సీన్ లేదు.. ధరణి అవకతవకలు, అవినీతిపై జ్యుడీషియల్ కమిషన్ వేస్తారట. అంతే. అంతేనా..? మరి అరెస్టులు, జైలు. ఏపో చిన్న పిల్లలాటన..? అరెస్టు చేసి జైలుకు పంపుడు. ఇదో డైవర్సన్ అంతే. అంటే ఇలా మాటలు చెప్పి చేయకపోతే మళ్లీ మాటలు నమ్ముతారా..? అవును.. నమ్మరు…! ఫ్లైట్ దిగంగనే అన్నడు. దిగి రెండు రోజులైంది… ఏదీ ఏం కదలిక లేదే…! దీపావళికి ముందు అంటుండు.. అది కూడా అయిపోతది చూడు. అంతేనా..! కేటీఆర్ ని లోపలేస్తే మరింత రెచ్చిపోతడు. కొంత సానుభూతి కూడా వస్తది. చూడు. నోరుగాయి ఉన్నోడాయె.. ఊకుంటడా..? జైలుకుపోయి వచ్చినంక మరింత లేస్తడు. ఇగ నేనే సీఎం క్యాండిడేట్ అనే రేంజ్‌లో రెచ్చిపోతడు చూడు… ! సరే సరే గానీ, పోదం నడు చీకటయితుంది..? అవ్ గానీ ఒకటి గమనించినవ… ఏందీ..? పొన్నం ప్రభాకర్ నవంబర్ 31అన్నడు ఇన్నవా..? నవంబర్‌ల 31 ఉంటదనే.. దీన్ని కూడా ఇగ బీఆరెసోళ్లు వదలరు.. ట్రోల్ చేస్తరు చూడు…! నీ యవ్వ ఆళ్లకు పనిలేదు… నీకు పనిలేదు నడువ్..ఈడనే సెక్రటేరియట్‌ల పంటవేందీ..? సరే నడువు.. చూద్దాం దీపావళికి ఏం జరుగుతదో…ఇగో ఇలా ముగిసింది కేబినెట్ భేటీ… ప్రెస్‌మీట్… ఆ తరువాత విలేకరుల గుసగుసలు..