ఒకరిపై మరొకరు…పర్సనల్ అటాక్స్…
ఒకరు రెచ్చగొట్టే రాజకీయాలు.. మరొకరు ప్రతీకారేచ్చతో దూకుడు..
చేసే పనులు చేయక… చిల్లర పంచాయితీలేల …?
జనం చీదరించుకుంటున్నారు..? గత తప్పిదాలపై లోపలేసేయొచ్చు కదా..? చెప్పడం ఎందుకు..?
మూసీని పైలట్ ప్రాజెక్టుగా మెల్లగా చేస్తూ పోవచ్చు కదా…? అంత హడావుడి ఎందుకు..?
కేటీఆర్ నోటి దురుసుతో మరింత ఇబ్బందికరంగా బీఆరెస్…. సర్కార్ వ్యక్తిగత అటాక్స్‌లతో జనంలో నెగెటివ్..
(దండుగుల శ్రీనివాస్)
8096677451
రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. సోషల్ మీడియా కేంద్రంగా కేటీఆర్ రెచ్చగొట్టే రాజకీయాలకు దిగుతుండగా.. తానేం తక్కువ తినలేదన్నట్టు సీఎం రేవంత్ … కేటీఆర్ టార్గెట్ గా చేస్తున్న పాలిటిక్స్‌పై జనం ఏవగించుకుంటున్నారు. ఇద్దరూ ఇద్దరేగా మారారు. ఒకరేమో ఇంకా తానే అధికారంలో ఉన్న షాడో సీఎం అనుకుంటున్నాడు. ఏమాత్రం అహంకారం తగ్గలేదు. తన చేతిలో ఉ న్న సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎటు తిప్పితే అటు వెళ్తున్నాడు. నోటికేదొస్తే అది వాగుతున్నాడు.
మరొకరు తాను సీఎంనని కూడా మరుస్తున్నాడు. వ్యక్తిగతంగా దెబ్బ కొట్టేందుకు దూకుడు మీద ఉన్నాడు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. కేటీఆర్ ఫామ్‌హౌజ్ జన్వాడాలో ఆయన బామ్మర్ది రేవ్ పార్టీ నిర్వహించాడని. డ్రగ్స్ తీసుకున్నాడని. రోజంతా ఇదే రచ్చ రాజకీయం నడిచింది. అక్కడ పార్టీ నడిచింది వాస్తవమే. లిక్కర్ దొరికింది కూడా వాస్తవమే. మరి ఇంతల సుద్దపూస మాటలు మాట్లాడుతున్నకేటీఆర్ కు ఆ మాత్రం భయం, భక్తి ఉండొద్దా..? ఒళ్లు దగ్గర పెట్టుకుని నడుచుకోవాలి.. తన వాళ్లకు జాగ్రత్తలు చెప్పాలి కదా. ఇదిగో ఇప్పుడు ఇలా దొరికారని కాంగ్రెస్ దాన్ని నానా యాగీ చేసింది.
స్పాట్‌ను స్పాట్‌లా దాడి చేసి చర్యలు తీసుకుంటే సరిపోయేది. ఇందులో సర్కార్ కూడా అతి ప్రదర్శించింది. విమర్శల పాలయ్యింది. ఎలాగూ కేటీఆర్‌ను దీపావళికి ముందే అరెస్టు చేస్తామంటూ ఊదరగొడుతున్నారాయే. సైలెంట్‌గా ఆ పనేదో చేసుకుపోయి పరిపాలన పై పట్టు సాధిస్తూ పోవాలి కదా. మరి ఇదేం చిల్లర పంచాయితీ. ఇదేమన్నా జనానికి ఉపయోగపడే చర్యలా. కేటీఆర్, కేసీఆర్, హరీశ్‌లపై కేసులు పెట్టాలంటే చాలానే ఉదంతాలు, నేపథ్యాలు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. అవన్నీ ముందుగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదంటూనే ముందే ఎందుకా ప్రకటనలు…? డేట్లు ఫిక్స్ చేసి మరీ మీకుందిరోయ్.. అని ఎందుకు బెదిరింపు రాజకీయాలు…?
కేటీఆర్ నోటి దరుసు.. రెచ్చగొట్టే రాజకీయాలు… రేవంత్ అంతే దూకుడు, సంయమనం పాటించకపోవడం.. చేయాల్సిన పనులు కామ్‌గా చేసుకుంటూ పోతూ జనాలకు చేరువయ్యే ప్రయత్నం చేయకపోవడం.. ఇద్దరి వైఫల్యాలుగా చూస్తున్నారు జనం, లీడర్లు. మూసీ వద్దంటుంటే దీన్నో పైలట్ ప్రాజెక్టుగా చేస్తూ జనాన్ని మెప్పిస్తూ చేసుకుంటూ పోవచ్చు. కానీ పంతం వీడటం లేదు. పరిపాలనపై పట్టుసాధించే క్రమంలో దృష్టి సారించాల్సిన రేవంత్.. ఇలా చిల్లర పంచాయితీల్లో ఇరుక్కుని కేటీఆర్ నోటి దురుసు మాటలకు బలికావల్సి రావడమే ఇక్కడ విషాదం.
హుందాగా చేయాల్సింది చేసేయండి.. లోపలేద్దామనుకుంటున్నారు… ఆధారాలున్నాయంటున్నారు…..? ఇంకేం ప్రొసీడ్. మధ్యలో ఈ బామ్మర్దిని కూడా లోపలేస్తే గానీ మనసు కుదుటపడదంటారా..? ఎవరితో నష్టం జరిగిందో వారినే టార్గెట్ చేయండి…? చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి… జనంతో పెరిగిన అంతరాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాల్సే ఉంది… మరి అవే కదా ఇప్పుడు తక్షణ కర్తవ్యాలు. ఈ చిల్లర పంచాయితీలెందుకు…? మోర్లో రాయి వేసుడెందుకు…? మీద బురద చిల్లించుకోవడం ఎందుకు…?