(దండుగుల శ్రీనివాస్)
మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు దీపావళి కానుక ఇచ్చాడు. 3 శాతం డీఏను పెంచాడు. ఈ ఏడాది జూలై నుంచి దీన్ని అమలు చేయనున్నారు. కేంద్రం అలా నిర్ణయం తీసుకున్నదో లేదో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల్లో చర్చ మొదలైంది. కొందరైతే ఏకంగా పుడితే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులుగానే పుట్టాలి అంటూ తమలోని అసంతృప్తి, వైరాగ్యాన్ని కలగలిపి వెటకారంగా మెసేజ్‌లు కూడా పెడుతున్నారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తరువాత అది ఐదు కుపెరిగింది.
ఇప్పుడు ఐదు డీఏలు గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది. దసరా, దీపావళి సందర్బంగా పెండింగ్ డీఏలు క్లియర్ చేస్తారని అంతా భావించారు. సీఎం అపాయింట్‌మెంట్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు. చక్కర్లు కొడుతున్నారు. కానీ సీఎం టైమ్ ఇవ్వడం లేదు. మొన్నటి వరదలకు ప్రభుత్వానికి అండగా నిలుస్తూ వారి జీతాల నుంచి 130 కోట్లు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులు. అయినా సీఎం మాత్రం ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. వారి డీఏలపై చడీచప్పుడు లేదు. ఉద్యోగులు మాత్రం దసరా పోయింది.. ఇక దీపావళికైనా డీఏలు ఇవ్వకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం ఇచ్చిన డీఏ పెంపుతో మరింతగా ఆశలకు రెక్కలు రాగా… ఇచ్చే అవకాశాలూ పెద్దగా కనిపించకపోవడంతో నిరాశకూ లోనవుతున్నారు. ఇలా వైరాగ్యపు మెసేజ్ లు పెట్టుకుంటున్నారు.
కేసీఆర్ తొలిసారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉద్యోగులను నెత్తినపెట్టుకున్నాడు. ఆ తరువాత ఆయనకు ఓట్లు తగ్గాయి. ఉద్యోగులు కేసీఆర్‌పై అంసతృప్తితో రెండోసారి సహకరించలేదు. దీంతో కేసీఆర్ మరింత కోపం పెంచుకున్నాడు ఉద్యోగులపై. దీని వల్ల ఆయనకు వచ్చిన లాభమేమీ లేకపోగా.. ముచ్చటగా మూడోసారి ఏకంగా ఉద్యోగుల కారణంగానే కాంగ్రెస్‌కు 32 సీట్లు వచ్చి చేరాయి. కాంగ్రెస్ సర్కార్ రావడానికి ఈ సీట్లు కీలకంగా మారాయి. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఎదురుచూడకతప్పడం లేదు వారికి.