(దండుగుల శ్రీ‌నివాస్‌)

మంత్రి కొండా సురేఖ చేసిన చీప్ కామెంట్స్ దుమారం ఢిల్లీ వ‌ర‌కు పోయింది. కాంగ్రెస్ పార్టీకి, ప్ర‌భుత్వానికి తీవ్ర న‌ష్టం చేకూర్చేలా ఆమె వ్యాఖ్య‌లు ఉండ‌టంతో అధిష్టానం సీరియ‌స్‌గా ఉంది. ఆమెను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని ఆలోచించే స్టేజీకి ఆపార్టీ వెళ్లిపోయిన‌ట్టు తెలుస్తోంది. కొండా వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ లీగ‌ల్ నోటీసులిచ్చాడు. క్ష‌మాప‌ణ చెబుతావా…? ప‌రువు న‌ష్టం వేయ‌మంటావా..? అన్నాడు.

కానీ కాంగ్రెస్‌పార్టీ క్ష‌మాప‌ణ చెప్పించే స్థితిలో లేదు. అలా చేస్తే బీఆరెస్‌కు మైలేజీ వ‌స్తుంది. చెప్ప‌క‌పోతే పార్టీ డ్యామేజీ నుంచి ఎలా కాపాడుకోవాలి..? ఓవైపు తెలుగు సినీ ఇండ‌స్ట్రీ మొత్తం కొండా వ్యాఖ్య‌ల‌పై దుమ్మెత్తిపోస్తోంది. సురేఖ మాట‌ల‌ను మంత్రి సీత‌క్క ఒక్క‌రే స‌మ‌ర్థించారు. ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు. అంద‌రికీ ఇది ఇబ్బందిక‌రంగా మారింది. ఎలా చేద్దాం. ఈ సాకుతో ఆమెను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డ‌మే మేల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చారు. దీనిపై రాహుల్ ఇవాళ ఓ నిర్ణ‌యం తీసుకోనున్నాడు.

అయితే గ‌తంలో సీఎం రేవంత్‌.. పీసీసీ చీఫ్‌గా ఉన్న‌ప్పుడు ర‌కుల్ రావ్ అంటూ కామెంట్స్ చేశాడు. ఈ క్ర‌మంలో కొండాకు సీఎం మ‌ద్ద‌తు ఉంటుందా..? ఆమెను కాపాడుకుంటాడా అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. అయితే అప్పుడు ప‌రిస్థితి వేరు. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు స‌ర్కార్‌ను చుట్టి ముట్టి ఉక్కిరిబిక్కిరి చేయ‌డం ఒక‌టైతే, మొత్తం సినీ ఇండ‌స్ట్రీ భ‌గ్గుమంటోంది. ఇది తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిస్తితే. అందుకే దీనిపై చ‌ర్య‌లు తీసుకుంటే త‌ప్ప నష్ట నివార‌ణ జ‌ర‌గ‌దు.