(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్‌ను , బీఆరెస్‌ను బొంద పెట్టడమే లక్ష్యంగా పావులు కదిపి సక్సెసయిన మోడీ .. ఇప్పుడు రేవంత్ సర్కార్ ను వెంట పడ్డాడు. వేట మొదలుపెట్టాడు. తాజాగా మోడీ ఇక్కడి ప్రభుత్వంపై నిప్పులు చెరగడమే అందుకు సంకేతంగానే చూడాలి. రుణమాఫీపై రేవంత్ సర్కార్ తెలంగాణ రైతులను మోసం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడాయన. మోసపూరిత వాగ్ధానాలతో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రైతులు ఇప్పుడు రోడ్డున పడ్డారని విమర్శించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రుణమాఫీ చేశామని బీఆరెస్‌కు చాలెంజ్ విసురుతూ ఇక్కడ రేవంత్ సర్కార్ ప్రతిపక్ష పార్టీని ఎదుర్కుంటుండగా దీనిపై మోడీ స్పందించడం కాంగ్రెస్‌కు దిమ్మదిరిగేలా చేసింది.
వాస్తవానికి రాష్ట్ర బీజేపీ ఇప్పటి వరకు ఈ రుణమాఫీ అంశాన్ని టచ్ చేయలేదు. అది తమకు పట్టని విషయంగానే చూస్తూ వస్తోంది. కానీ మోడీనే ఏకంగా దీనిపై మాట్లాడటం, రాష్ట్ర రాజకీయాలను దేశానికి తెలియజెప్పడం ఆయన తీసుకున్న స్టాండ్ ఏమిటో తెలిసిపోయింది. పరోక్షంగా రాష్ట్ర బీజేపీకి ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా సంకేతిచ్చాడు. ఏమని..? ఇక కాంగ్రెస్ మీద పడండి. దుమ్మెత్తిపోయండని. అంతకు ముందు పదేళ్ల పాటు బీఆరెస్ వెంట పడ్డాడు. కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేసేదాకా వెంటాడాడు. కవితను జైలు పాలు చేశాడు. అధికారమే దూరమయ్యేలా చేశాడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ బీజేపీ గెలిచేది లేదని మోడీకి తెలుసు. కానీ కేసీఆర్ అధికారంలోకి రావొద్దని బలంగా కోరుకున్నాడు మోడీ.
అందుకే కాంగ్రెస్ బలపడినా పట్టించుకోలేదు. ఒక దశలో తామె కాంగ్రెస్ బలపడేలా చేశారు కూడా. టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చి దేశ రాజకీయాలను శాసిస్తానని, అగ్గి పెడతానని కేసీఆర్ ఏదేదో మాట్లాడంపై మోడీ అలర్టయ్యాడు. పార్టీకి కీలక వ్యక్తిగా ఉన్న బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేసేందుకూ ప్రయత్నించి మోడీని బ్లాక్‌మెయిల్ చేద్దామనుకున్న కేసీఆర్‌ను దెబ్బతీయకపోతే బీజేపీకి నష్టమేనని భావించాడు మోడీ. అందుకే వెంటాడి వేటాడాడు. ఓడించి ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేశాడు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తరువాత ఓ పది నెలలు వెయిట్ చేశాడు.
ఇదిగో ఇప్పుడిలా వేట షురూ చేశాడు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల నుంచి మొదలు కొని మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా ప్రభుత్వ వ్యతిరేకతను తమ పార్టీయే అందిపుచ్చుకోవాలని, బీఆరెస్‌కు ఆల్టర్నేట్ పార్టీగా ప్రజలు బీజేపీనే చూడాలని మోడీ తనదైన శైలిలో ఎత్తులు వేయడం షురూ చేశాడు. మోడీ, అమిత్ షా ద్వయం తీసుకోబోయే నిర్ణయాలు రాజకీయంగా ఎలా ఉంటాయో తెలుసు. ఇప్పుడు ఇక్కడ అదే రిపీట్ కాబోతుంది. అప్పుడు కేసీఆర్ .. ఇప్పుడు రేవంత్ వంతు. కేంద్రంతో రాష్ట్రానికి సయోధ్య ఇప్పుడూ ఉండదు. రాజకీయ కోణం తప్ప. మళ్లీ అప్పటి రోజులే ఈ సర్కార్ హయాంలో కూడా రిపీట్ అవుతాయి.జస్ట్ వెయిట్ అండ్ సీ….