వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్:
పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రైతు ధర్నాలు స్వాగతం చెబుతున్నాయి. రైతురుణ మాఫీ, రైతు భరోసా ముళ్ల పీఠం ఆయన ఆసీనులయ్యేందుకు ముస్తాబైంది. ఆయన శనివారం రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వ్యవసాయం అంటే ప్రాణమని, కేసీఆర్ దానికి ప్రాణం పోశాడని ఆ ప్రభుత్వంలో ఊదరగొట్టిన పోచారం బీఆరెస్‌ను వీడేటప్పుడు కూడా ఇవే మాటలు వల్లెవేశాడు. రైతు రుణమాఫీ రేవంత్ చేస్తున్నాడని, రైతు భరోసా పెంచి ఇస్తున్నాడని, అందుకే రైతుల సంక్షేమం కోసం పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నానని ప్రకటించుకున్నాడు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అంత సీన్ లేదని తొమ్మిది నెలల కాలంలోనే తేలిపోయింది.
రుణమాఫీ సంపూర్ణం కాలేదు. ఈనెల 16న ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని రైతులంతా ఎక్కడివారక్కడే ధర్నాలకు దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులది ఇదే పరిస్థితి. సర్వే పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి ఏమని సూచన చేస్తాడో పోచారం. ఇక రైతు భరోసా ఊసేలేదు. ఒక సీజన్ మొత్తం నష్టపోయింది రైతాంగం. మరి దీనిపై ఏమంటాడో. సీలింగ్ ఐదెకరాలు, పదెకరాల మాటలతోనే కాలం సరిపెడుతున్నారు. ఎప్పుడిస్తారో తెలియదు . రబీ సీజన్ ప్రారంభం కానుంది. అప్పుడైనా ఇస్తారా చూడాలి. గవర్నమెంట్ తొలినాళ్లలోనే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నది.
మరి వ్యవసాయ రంగంలో అపార అనుభవం ఉందని, రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడతానని చెబుతూ రాజకీయ పబ్బం గడుపుతున్న పోచారం ఈ పదవి ద్వారా ఏం చేస్తాడు..? చూడాల్సి ఉంది.