(దండుగుల శ్రీనివాస్)
నమస్తే తెలంగాణ పేపర్‌లో ఓ ఫోటో వార్త కదిలించింది. హృదయవిదారకంగా ఉంది. ఒక్క మరుగుదొడ్డి.. దాని ముందు విద్యార్థినులు బారులు తీరి ఉన్న దృశ్యం అయ్యో అనిపించింది. ఇలాంటి దారుణాన్ని కళ్లముందుంచిన నమస్తే తెలంగాణ విలేకరికి, ప్రచురించేందుకు అనుమతినిచ్చిన ఎడిటర్ కృష్ణమూర్తికి అభినందనలు. ఇది సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనిది. అందరూ కలిసి 150 మంది వరకు ఉన్నారు. వీరందరికీ ఇదొక్కటే లెట్రిన్. ఇదీ శిథిలావస్థకు చేరింది. ఇదీ ఫోటోవార్త.
బాగుంది. మన రాష్ట్రంలోని సర్కార్ పాఠశాలలు, కాలేజీల దుస్థితికి ఇది అద్దం పడుతోంది. ఒక్క లెట్రినే ఉంటే ఇన్నాళ్లూ పాలించిన మన పాలకులేం చేశారో..? వాళ్లకు పట్టలేదా..? కనిపించలేదా..? నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ రాలేదని ఓ ముక్తాయింపు కూడా ఇచ్చారులెండి చివరలో. అంతా బాగానే కవర్ చేశారు. అద్భుతమైన ఫోటో దొరకబట్టినమని చంకలు గుద్దుకున్నారు కాబోలు. ఇలా అచ్చేసి కాంగ్రెస్ సర్కార్‌ను ఇరకాటంలో పడేశామని సంబరపడీ ఉంటారు. సరే వారానందం వారిది. కాదనలేం.
కానీ.. ఈ పదేండ్ల పాలనలో కనీస సౌకర్యాలు ఇక్కడ కల్పించలేకపోయారా…? కలెక్టర్ తలుచుకున్నా అయిపోయేది. వారి దృష్టికి వెళ్లలేదా..? ఇంత మీడియా ఉన్నా ఈ చాంతాడంత బారులుతీరి ఉన్న బాలికల లైన్ కనిపించలేదా..? కనిపించినా అప్పుడు రాయలేకపోయారా..? వ్యవస్థ మార్చాల్సిన మీడియా ఇలా భయపడి వ్యవస్థనే లోపాలమయం చేసిందా..? అది ఇప్పుడు బయటపడుతుందా..? ఇలా ఎన్నో ప్రశ్నలు. కడుపు చించుకుంటే కాళ్లమీదే పడుతుంది కృ.తి. ఏదో అత్యుత్సాహంతో ఈ ఫోటో అచ్చేసి సర్కార్‌ను ఇరుకున పెట్టి, బీఆరెస్ పెద్ద మనుషుల మెప్పు పొంది సీటు పదిలం చేసుకుని హమ్మయ్య అని అనుకుని ఉంటావు. కానీ ఈ ఒక్క ఫోటో వార్త… మీ పదేళ్ల పాలనను, సర్కార్ విద్యావ్యవస్థ తీరును, మీడియాను గుప్పిట్లో పెట్టుకున్న మీ అధికార దర్పాన్ని … ఇంకా చాలా చాలా విషయాలను అద్దం పడుతోంది.