కంటతడిలో కాంతిరేఖలు.. క్రెడిట్ అంతా రేవంత్ సర్కార్‌కేనా..?
కేసీఆర్ తప్పు చేశారా..? రమణ మేలు మరవలేనిది… !!
జర్నలిస్టుల స్థలాల వెనుక కన్నీటి వాస్తవం..
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ క్రెడిట్ ఎవరిది..?
కేసీఆర్ జర్నలిస్టుల ఉసురుపోసుకోవడం ఘోర తప్పిదం..
కాలక్రమంలో అందుకే ఆయన కనుమరుగైపోయాడు..
ఇది రేవంత్ సర్కార్‌కే క్రెడిట్ దక్కతుంది..
పోరాడిన ప్రతీ జర్నలిస్టుకు వందనాలు..
– సీనియర్ పాత్రికేయుడు మ్యాడం మధుసూదన్
ఎన్నో అనుమానాలు.. అవమానాలు కన్నీళ్లు కడగండ్లు.. పోరాటాలు ఇలా ఎన్నో అవాంతరాలను, ఆటంకాలను దాటుకొని ఎన్నో ఏండ్ల నిరీక్షణ తరువాత వెయ్యి మంది సీనియర్ జర్నలిస్టుల కళ్లల్లో ఓ కాంతి కనిపించింది. ఓ చారిత్రక ఘట్టానికి రవీంద్రభారతి వేదికైంది. ఉద్విగ్న క్షణాల మధ్య జర్నలిస్టులకు అధికారికంగా జవహార్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచ్‌వల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ హౌజింగ్ కో ఆపరేటివ్ లిమిటెడ్‌కు ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి తన స్వహస్తాల మీదుగా స్థల స్వాధీన పత్రాన్ని జర్నలిస్టులకు అందించారు. ఈ పదాహారేండ్ల సుధీర్ఘ పోరాటంలో ఎవరి పాత్ర ఎంత..? జర్నలిస్టులకు జాగాను కేటాయించడంలో దాన్ని అప్పగించడంలో ఏ ప్రభుత్వం పాత్ర కీలకమైంది…? సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా గత ప్రభుత్వం ఎందుకు జాగాను అప్పగించలేదు..? ఈ క్రెడిట్ ఎవరిది..? గత ప్రభుత్వం చేసిన పొరపాటేమిటి..? అసలు ఈ ఇళ్ల స్థలాల వెనుక ఉన్న వాస్తవం ఏమిటీ..? ఈ క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డి సర్కార్‌కే వెళ్తుందా..? అసలు వాస్తవమేమిటీ..?
ఎన్నికలకు రెండేండ్ల ముందు ఉన్న కాలాన్ని గమనిస్తే సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తరువాత తమకు విలువైన స్థలం దక్కుతుందని ఆశించిన వారికి గత ప్రభుత్వ తీరు ఆశనిపాతంలా మారింది. అప్పుసప్పు చేసి రెండు లక్షల రూపాయలు చెల్లించి ఏండ్లు గడిచినా మా జీవితాలు ఇంతేనా…ఇక ప్రభుత్వం కరుణించదా..? అంటూ మానసికంగా కృంగి కృశించి నశించి చనిపోయిన వారెంతో మంది. 72 మంది ఆశలు నెరవేరకుండానే రెక్కలు ముక్కలు చేసుకుని అప్పులు చేసి కట్టిన సొమ్ము తిరిగి రాకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయారు. వారి ఆత్మలు నిన్నటి వరకు ఘోషిస్తూనే ఉన్నాయి. బహుశా హృదయాంతరాల నుంచి వచ్చిన కన్నీటితో కూడిన వాళ్ల శాపమే గత ప్రభుత్వానికి పాపమై చుట్టుకుందేమో…!
సుప్రీం కోర్డు తీర్పు వెలువడిన ఒక్క సంవత్సరం వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో సమరమా..? సయోధ్యనా అన్న పరిస్థితుల్లో టీమ్ జేఎన్‌జే సొసైటీ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జరిగిన ఒక సంఘటన అందరినీ కలిచివేసింది. జర్నలిస్టుల దీన, దయనీయ, హీనమైన పరిస్తితికి అద్దం పట్టింది. అప్పటికే దాదాపు నాలుగు దశాబ్దాలుగా జర్నలిజంలో సేవలందించిన సీనియర్ పాత్రికేయులు దొరై సామి.. నాకు పయింట్, షర్ట్ తప్ప ఏమీ మిగలలేదురా…. మాకు స్థలం ఇవ్వండిరా అని దుమ్మెత్తిపోశాడు. తమ ఉసురు తగులుతుందని, స్థలం వచ్చే లోపు బతుకుతానో లేదోనని ఆవేదన వ్యక్తం చేశాడు. విధి వక్రించి తరువాత మహాధర్నాలో పాల్గొన్నరెండు రోజులకే ఆయన గుండెపోటుతో చనిపోయాడు. ఇలా 72 మంది వివిధ కారణాలతో అసువులు బాసారు. వాళ్ల ఆత్మలు ఘోషిస్తునే ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నప్పటికీ కేసీఆర్ చేసిన ఘోరమైన తప్పిదాలలో ఒకటి జర్నలిస్టులకు ఈ ఇళ్ల స్థలాలివ్వకపోవడం. కేసీఆర్ సర్కార్ ఎన్నో సాకులు చూపి వాయిదా వేస్తూ వచ్చింది. ఆంద్ర వాళ్లు ఉన్నారని, ఆంధ్రజ్యోతి వాళ్లు తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, పాలాభిషేకానికి కొన్ని పాలు తక్కువయ్యాయని, సీఎం ను ఎక్కువగా పొగడలేదని, ఎన్వీ రమణను నెత్తికెత్తుకున్నారని, ఎంత క్రెడిట్ రావాలో అంత రాలేదని, రకరకాల కారణాలతో మొండి చేయి చూపిన ప్రభుత్వం స్థలం ఇవ్వకముందే పతనమైపోయింది.
కన్నీళ్లతో కూడిన శాపం పాపమై వెంటాడుతుందని చాలా మంది జర్నలిస్టులు శపించారు. అత్యంత బలమైన ప్రభుత్వమనుకున్న బీఆరెస్ ప్రభుత్వం కాలక్రమంలో కుప్పకూలకతప్పలేదు. చాలా మంది మిత్రులు అశోక్‌రెడ్డి, రమణరావు, బోడపాటి శ్రీనివాస్, లక్ష్మణ్, నాగభూషణం తదితరులు అరెస్టులకు ఎదురొడ్డి పోరాడారు. ఎప్పుడైతే బండి సంజయ్ అడుగుపెట్టిండో అప్పటి నుంచి పోరాటానికి పునాదులు పడ్డాయి. ఎందరో మిత్రులు పో రాటం జరిపారు. 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉదార స్వభావంతో నిజాంపేటలో, బాచుపల్లి,పేట్ బషీరాబాద్‌లో 70 ఎకరాలు కేటాయించాడు. అప్పుడు రియల్ ఎస్టేట్ పుంజుకునే దశ . కానీ దానికే రెండు లక్షల రూపాయలు చెల్లించారు. ఇవాళ దాని విలువ రెండు కోట్ల రూపాయలు.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు ఆగస్టు 2022లో ఎన్వీ రమణ తీర్పునిచ్చారు. ఎమ్మెల్యేలకు, ఐపీఎస్‌లకు జర్నలిస్టులకు ప్రభుత్వ స్థలాలను అప్పజెప్పరాదని కొందరు కేసు పెట్టారు. జర్నలిస్టులు డబ్బులు పెట్టి కొన్నారు… చాలా క ష్టపడి కొన్న స్థలాలివీ. ఇబ్బంది పెట్టొద్దు. ఎమ్మెల్యేలకు ఇవ్వకున్నా పర్వాలేదని పెద్ద మనుసుతో ఎన్వీ రమణ తీర్పునిచ్చారు. దీనికి ముందు కేసీఆర్ సర్కార్ ఓ అఫడవిట్ ఇచ్చింది. అందులో మెలిక పెట్టింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వండని సంప్రదింపులు చేసిన విషయం వాస్తవం. అఫడవిట్లో స్పష్టత లేకపోవడం వివాదస్పదమైంది. ఇస్తే కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయేవారు. ఆ క్రెడిట్ ఇప్పుడు కాంగ్రెస్‌కు దక్కింది.
కేటీఆర్ పేట్ బషీరాబాద్ స్థలం ఓ ప్రైవేటు కంపెనీకి ఇవ్వాలనుకున్నాడనే ఆరోపణలు అప్పుడు వచ్చాయి. మధ్య తరహా జర్నలిస్టులు, కొత్త తరం జర్నలిస్టులు మా పరిస్థితేంటీ అని అడిగితే వీళ్లను కూడా సాకుగా చూపారు. కేసీఆర్ ఎంత పొరపాటు చేసిండంటే ఆయన చేసిన ఘోర తప్పిదాల్లో ఇదొకటి. క్రెడిట్ చేజార్చుకున్నాడు. అప్పుడు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఈ తరువాత చెన్నారెడ్డి పీరియడ్‌లో ఫొటోగ్రాఫర్లుకు ఇళ్ల స్థలాలు దక్కాయి. కేసీఆర్ హయాంలో కూడా ఇవి ఇవ్వాల్సి ఉండే. ఆయన పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుండె. కానీ ఈ లాజిక్ మిస్ అయ్యాడు. సీఎం రేవంత్ దాన్ని అందిపుచ్చుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంతో ఇతోధికంగా వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూపిన చొరవ అభినందనీయం.
జర్నలిస్టులకు స్థలాలివ్వాల..? సిలిండర్లకు సబ్సిడీ ఇస్తున్నామని అవమాన పరిచాడు కేసీఆర్. కాళ్లావేళ్లా పడ్డారు. కనికరించమన్నారు. కేటీఆర్‌ను ప్రాదేయపడ్డారు. ఎన్నికలకు ముందు వీళ్లకు వేరే స్థలం ఇవ్వకుండా సిలిండర్లలో సబ్సిడీ అని అపహాస్యం పాలు చేసిండు. ఈయన మాటలకు దొరైస్వామితో పాటు ఏడుగురు చనిపోయిండ్రు. బండి సంజయ్‌ను తీసుకుని పోయిండ్రు. కన్నమ్మ కష్టాలుపడి రెండు లక్షలు కట్టిండ్రు.. అని బండి సంజయ్ ప్రభుత్వాన్ని అడిగిండ్రు.. అటునుంచి పోరాటం మొదలైంది. వివాదాలు వచ్చినయి.. కాంగ్రెస్ మేనిఫెస్టోల పెట్టించిండ్రు. మల్లురవి , పొంగిలేటి, భట్టి విక్రమార్క..ఈ ఇష్యూని మేనిఫెస్టోలో చేర్చారు. ఆ మాటకు కట్టుబడి పొంగిలేటి మాట ప్రకారం ఉన్నడు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో ముందుకు వెళ్లగా సీఎం రేవంత్ సర్కార్ ఈ క్రెడిట్ దక్కించుకున్నది. సుప్రీం తీర్పు వచ్చినా స్థలాన్ని ఆధీనం చేసుకకపోవడంతో కేసీఆర్‌కు చరిత్రలో హీనంగా మిగిలిపోయే పరిస్తితులు వచ్చాయి. పోరాటాలు, ఉద్యమాలు చేసిన జర్నలిస్టులకు ఈ సందర్భంగా వందనాలు.
ప్రత్యేక చొరవ చూపిన ప్రెస్ అకాడమీ చైర్మన్, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్‌రెడ్డితో పాటు బోర్డు సభ్యులు వంశీ, రవికాంత్ రెడ్డి, కిరణ్ , అశోక్‌రెడ్డి, రమణరావు వీరికి అభినందనలు..
వైస్ సర్కార్ లో కూడా ప్రభుత్వం నుంచి స్థలాన్ని సాధించేందుకు కృషి చేసిన అందరికీ అభినందనలు..
ఎన్వీ రమణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న జర్నలిస్టులు (ఫైల్ ఫోటో)
మ్యాడం మధుసూదన్…
సీనియర్ పాత్రికేయులు..