వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌:

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే వారికి అండ‌గా నిల‌వాల్సిన కేటీఆర్ అమెరికా వెళ్లాడ‌ని, కేసీఆర్ మౌన మునిగా మారాడాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆయ‌న ఖ‌మ్మంలో ప‌ర్య‌టించారు. అక్క‌డి ప‌రిస్తితుల‌ను అడిగి తెలుసుకున్నారు. జ‌రిగిన న‌ష్టం అంచ‌నా వేశారు. బాధితుల‌తో మాట్లాడారు. అధికారుల‌తో ఆరా తీశారు. మంత్రుల‌తో క‌ల‌సి ఖ‌మ్మం క‌లియ‌తిరిగారు. అనంత‌రం స‌మీక్ష నిర్వ‌హించి మాట్లాడారు. భారీ వర్షాల వల్ల జనజీవితం అతలాకుతలం అయింద‌ని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారున్నారు. భారీ వర్షాల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారని, భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి సాయం కోరామ‌న్నారు.

తక్షణమే జాతీయ విపత్తు గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామ‌ని తెలిపారు. నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వర్షాల వల్ల రాష్ట్రంలో 5438 కోట్ల నష్టం జరిగిందని వివ‌రించారు. తెలంగాణ లో పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల దగ్గర కు వెళ్తున్నారని, తెలంగాణ లో ప్రతిపక్ష నేత మౌన ముద్ర దాల్చారని కేసీఆర్‌ను విమ‌ర్శించారు. కేటీఆర్ అమెరికా లో ఎంజాయ్ చేస్తూ మంత్రులు పనిచేయడం లేదంటు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జాతీయ విపత్తు గా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదని నిల‌దీశారు.

కేసీఆర్ చిల్లిగ‌వ్వ ఇవ్వ‌డు..

వర్షాల కారణంగా జనం సర్వం కోల్పోయారని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజలకు చిల్లిగవ్వ కూడా కల్వకుంట్ల కుటుంబం ఇవ్వదని, కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ. లక్షల కోట్ల సొమ్ములో రూ. వెయ్యి కోట్లో.. రూ. రెండు వేల కోట్లో బాధితులకు సహాయంగా ఇవ్వవచ్చు కదా? అని ప్ర‌శ్నించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామ‌న్నారు. పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 10 వేలు పరిహారం ఇస్తామ‌న్నారు.
వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.పదివేలు ఇస్తున్నామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed