వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
ముగ్గురు మంత్రులు ఉండీ ఏమీ చేయలేకపోయారు. ఆ వంతెనపై ప్రాణాలరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ తొమ్మిది మంది ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హెలికాప్టర్ తెప్పిస్తున్నామని చెబుతూ కాలయాపన చేశారేగానీ ఆ మంత్రులు ఒక్క అడుగు ముందుకేసింది లేదు. వారిని కాపాడే ప్రయత్నం చేసిందీ లేదు.
పాలేరు నియోజకవర్గంలోని వెంకటగిరి గ్రామస్తులు ప్రకాశ్‌నగర్ వంతెనపైకి వెళ్లారు. వరద ఉధృతిని చూస్తున్నారు. అప్పటికే ఆ వరద పెరిగి వంతెనపైకి వచ్చింది. దాంట్లో 9 మంది గ్రామస్తులు చిక్కుకున్నారు. ఇది తెలిసినా వారిని రక్షించేందుకు ఎవరూ లేరు. 15 గంటల పాటు ప్రభుత్వ సాయం కోసం చూస్తున్నా ఎవరూ రాలేదు.ఇంకొంచెం సేపయితే వారు ఆ వాగు ఉధృతిలో కొట్టుకుపోయే వారే. అప్పుడే హర్యానాకు చెందిన జేసీబీ డ్రైవర్ సాహసం చేశాడు. వారిని కాపాడి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాడు.