వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్:
బీజేపీతో ములాఖత్ అయి వారి మద్దతు తీసుకోవడం ద్వారానే కవితకు బెయిల్ వచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. అందుకే ఈడీ ఉదాసీనంగా వాదనలు చేసి కవితకు బెయిల్ వచ్చేలా చేసిందని, గతంలో వాదించినట్లుగా ఎందుకు వాదనలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
బీఆరెస్ త్వరలో బీజేపీలో విలీనం కావడం ఖాయమన్నారు. కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలో ఏయే బీజేపీ నేతలతో మాట్లాడారో తమ వద్ద ఆధారాలున్నాయన్నారు మహేశ్ కుమార్ గౌడ్. న్యాయవ్యవస్థలపై మాకు అపారమైన గౌరవం ఉందన్నారు. మేం న్యాయవ్యవస్థలను, తీర్పులను తప్పు బట్టడం లేదని, కేసులో ఈడీ పాత్రపై మేం మాట్లాడుతున్నామన్నారు. గతంలో బలమైన వాదనలు చేసి కవితకు బెయిల్ రాకుండా చేసిన ఈడీ.. ఇప్పుడు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించిందో అందరికీ తెలుసునన్నారు.