వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
ఐదు నెలల తరువాత ఆమె జైలు గోడల మధ్య నుంచి విడుదలై స్వేచ్చా వాయువులు పీల్చుకున్నది. ఉద్యమ పోరాటంలో ముందుండి నడిచి ధీర వనితగా గుర్తుంపు పొందిన ఆమెలో ఓ తల్లి, ఓ చెల్లి, ఓ భార్య .. బహుముఖాలు ఒక్కసారిగా బహిర్గతమై బావోద్వేగాలు తన్నుకొచ్చాయి. కన్నీళ్లు కట్టలు తెచ్చుకున్నాయి.
కొడుకును ఆప్యాయంగా కౌగిలించుకున్న ఆమె మనసు ఇన్నాళ్లూ దూరమయ్యానే అని తల్లడిల్లింది. ఆ తల్లి కన్నీటిని చూసి చలించిన కన్నకొడుకు మాతృమూర్తి కన్నీళ్లు తుడిచి భరోసానిచ్చేలా ఓదార్చాడు. కొడుకు సాగత్యంలో ఆమె చిన్న పిల్లే అయ్యింది. తల్లిలా కాకుండా ఓ కూతురిలా ఒదిగిపోయింది. అన్న చేతిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని అన్నాచెల్లెలి మమతానురాగాలను గుర్తుకు తెచ్చింది. కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన భర్తను ఆలింగనం చేసుకుని చంటిపాపల వెక్కివెక్కి ఏడ్చింది.