వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ప్రాణహాని పొంచి ఉందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయన ఇంటి వద్ద భద్రతను పెంచింది. ఔట్‌పోస్టు కూడా ఏర్పాటు చేసింది. హైడ్రా కమిషనర్‌గా ఆయన నియమితులైన నాటి నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ఏరియాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై విరుచుపడ్డాడు. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేయడంతో అక్రమార్కులకు గుండెదడ ప్రారంభమైంది.
ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీల నేతలు, రాజకీయ నాయకుల అక్రమ నిర్మాణాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. గుమ్మడికాయల దొంగల్లా అంతా నాది క రెక్టు అంటే నాది కబ్జా కాదంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నా.. హైడ్రా వద్ద ఓ పెద్ద లిస్టే ఉంది. దీన్ని వరుస పెట్టి కొట్టుకుంటూ పోవడమే తరువాయిగా పెట్టుకున్నది హైడ్రా. సీఎం రేవంత్ కూడా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగేది లేదని, అందరివీ కూల్చేస్తామని, ఎవరివీ వదిలిపెట్టబోమని తేల్చేయడంతో కమిషనర్ రంగనాథ్ చర్యలకు మరింత బలాన్నిచ్చినట్టయ్యింది.
ఈ నేపథ్యంలో ఆయన ప్రాణానికి ముప్పు ఉందని ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇదిప్పుడు చర్చనీయాంశమైంది. ఇక మళ్లీ ప్రముఖుల అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముహూర్తం ఖారారైందనే భావించాలి. తెల్లారితే ఏ కట్టడం నేలమట్టమవుతుందో అని చూడాల్సిన పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉత్కంఠకు తెరలేపుతున్నాయి.