(దండుగుల శ్రీనివాస్)
స్టేట్‌లో చంద్రబాబు మీడియా పెత్తనమే ఇంకా నడుస్తోంది. కేసీఆర్ పాలనలో భయపడ్డట్టు నటించారు. కొంత డప్పు కొట్టక తప్పలేదు. కానీ మనసంతా బాబుచుట్టే తిరిగింది ఈ పచ్చ మీడియాకు. కేసీఆర్ కూడా తనకు బాకా ఊదితే చాలనుకున్నాడు. కానీ వాటి మర్మాన్ని గ్రహించలేదు. అసలు నైజాన్ని తెలుసుకోలేకపోయాడు. ఇక నేనే ఉంటాననుకున్నాడు. చచ్చినట్టు ఈ మీడియా అంతా తనకు తోడుగా నిలవాల్సిందేనని ధీమాకు పోయాడు. ఇప్పుడు ఇదే మీడియా రేవంత్‌ను మనస్పూర్తిగా ఆకాశానికెత్తుతున్నది. అది కేసీఆర్ మీద కోసం, ద్వేషం, వ్యతిరేకత కొంతైతే.. బాబుకు అనుకూలమైన ప్రభుత్వంగానే ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నది ఈ పచ్చ మీడియా.
ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకొచ్చిదంటే.. హైడ్రా పేరుతో రేవంత్ సర్కార్ ఎడాపెడా అక్రమ నిర్మాణాలు కూల్చుతున్నాడు. బాగానే ఉంది. ఇది కొనసాగుతుందా..? ఆగిపోతుందా..? అనేది అందరికీ వచ్చే డౌట్. లేదు ఎవరినీ వదలా అని ఇప్పటికే సీఎం రేవంత్ కూడా చెప్పి ఉన్నాడు. మీడియా కూడా చాలానే హైప్ నిస్తున్నది ఈ అంశానికి. ఈ వార్తలు రేవంత్ రెడ్డి ప్రతిష్టను పెంచేవిగా ఆమాంతం ఎత్తేసి మరీ రాస్తున్నాయి. కానీ అప్పట్లో ఇదే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేందుకు కేసీఆర్ సర్కార్ రెడీ అయిందనే వార్తను ఉటంకిస్తూ.. అసలు పెట్టుబడులు వస్తాయా.? వీళ్లందరినీ ఆంధ్రకు వెళ్లగొడ్తారా..? ఇదేం క్షక్షసాధింపు అంటూ కొన్ని మీడియా సంస్థలు రాశాయి.
కానీ ఇప్పుడా ఊసు లేదు. బాబు కనుసన్నల్లోనే ఆ పాలసీకి అనుగుణంగానే ఇక్కడ నడిచే మీడియా సంస్థలన్నీ ఏకమయ్యాయి. పరోక్షంగా బాబు నిర్ణయాలే ఇక్కడ అమలవుతున్నాయా అనే అనుమానం వచ్చేలా రేవంత్ సర్కార్‌ను భుజస్కంధాలపై మోస్తున్నాయి ఇక్కడి మీడియా సంస్థలు. ఇప్పుడు ఆ మీడియా ఎట్ల చెబితే అట్లనే చేసేలా ఉన్నాడు రేవంత్ కూడా. అంతే ఇప్పుడు నిర్ణయాలు రేవంత్‌వి కావు. వెనుకుండి ఆడించే అదృశ్యహస్తానివి. ముందుండి నడిపించే మీడియా హౌజ్‌లవి. ఇప్పుడు పాలన అలా సాగుతున్నది. రుణమాఫీ అందరికీ రాలేదనే విషయాన్ని మాత్రం ఏ మీడియా వేలెత్తి చూడపం లేదు. అసలు అది సమస్యే కాదన్నట్టు ఆ టాపిక్‌నే పట్టించుకోవడం లేదు ఏ మీడియా. ఇప్పుడు రేవంత్‌న హైడ్రా హీరోను చేస్తూ ఈ రుణమాఫీని సైడ్ ట్రాక్ పట్టించేసింది మీడియా అండ్ బాబు టీమ్.. అండ్ రేవంత్ సర్కార్.
అవును ఇప్పుడు రేవంత్ హైడ్రా హడావుడితో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగుతాయా..? ఉన్నవి తట్టాబుట్టా సదురుకుంటాయా…? నాగ్ దెబ్బతో తెలుగు ఆంధ్ర ఇండస్ట్రీ అమరావతికి బిచాణా ఎత్తేస్తుందా..? ఇవన్నీ ప్రశ్నలే. దీనిపై ఏ మీడియాలోనైనా చర్చ జరుగుతుందా.? జరగదు. అంతే..!