(దండుగుల శ్రీనివాస్ )
ఆర్మూర్ రైతులంటే అంతే మరి. ఎవరినీ లెక్క చేయరు. డోంట్ కేర్ అంటారు. అనుకున్నది సాధించి తీరుతారు. ప్రేమిస్తే నెత్తికెత్తుకుంటారు. కోపం తెప్పిస్తే రోడ్డెక్కి బండారం బట్టబయలు చేస్తారు. అంతటి చైతన్యం ఉన్న ప్రాంతం ఆర్మూర్. వ్యవసాయంలోనే కాదు.. ఉద్యమాలు, నిరసనల్లో వీరిది ఓ ప్రత్యేక స్థానం. ఎవరైనా సరే ఇక్కడి రైతులతో పెట్టుకోవాలంటే జంకుతారు. వెనుకడుగు వేస్తారు. కేసీఆర్‌తో సహా.
ఇప్పుడు రేవంత్ పెట్టుకున్నారు. ఆ సెగ ఇవాళ ఆర్మూర్ వేదికగా సర్కార్‌కు తగిలింది. రైతు రుణమాఫీ కోసం ఇవాళ ఐక్య కార్యాచరణ కమిటీ చలో ఆర్మూర్‌కు పిలుపునిచ్చింది. ఇదెలా ఉంటుందో పోలీసులకు, సర్కార్ పెద్దలకు తెలుసు. గతంలో ఎర్రజొన్నల మద్దతు ధర కోసం ఆందోళన చేసి సర్కార్‌నే కదిలించింది ఇక్కడి రైతాంగం. అందుకే ముందు జాగ్రత్త పడ్డారు. ఎలాగైనా రైతులందరినీ ఒక్కచోట గుమిగూడకుండా చేయాలని పోలీసులు భావించారు. ఆంక్షలు పెట్టారు. అనుమతులు లేవన్నారు. కొద్ది మందితో ఓ చోట కూర్చుని మీటింగు పెట్టుకోమన్నారు. రోడ్ల పైకి రావొద్దన్నారు.జాతీయ రహదారిపైకి అసలే రావొద్దని కండిషన్ పెట్టారు.
అన్నింటికీ సరే అన్నారు. ఆంక్షల వలయంలో నిరసన కార్యక్రమం ఎలా జరుగుతుందో అని అనుకున్నారంతా. రైతులు వస్తారా అని అనుమాన పడ్డారు ఇంకొంత మంది. కానీ సమయానికి ఉప్పెనలా తరలి వచ్చింది రైతాంగం. పోలీసులు ఇచ్చిన చోట కాదు.. ఏకంగా జాతీయ రహదారిపైకే ఎక్కారు. అక్కడే బైఠాయించారు. ఫ్లకార్డుల చేబూనారు. నినాదాల హోరుతో అక్కడ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఆకుపచ్చ కండువాలు ధరించి ఓ పద్దతి ప్రకారం నేషనల్ హైవేపై బైఠాయించారు.
పోలీసులు హతాశులయ్యారు. ఏం చేస్తారు..? ఎంత మందిపై కేసులు పెడతారు..? కేసులు పెడితే మరింత బద్నామవుతుంది సర్కార్. ఆ విషయంలో క్లారిటీ ఉంది పోలీసులకు. అందుకే బుద్దిగా ట్రాఫిక్‌ను మళ్లించే పనిని భుజానికెత్తుకున్నారు. ఆర్మూర్ రైతులా మజాకా మరి.