వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఎవరిని నియమించాలనేదిపై అధిష్టానం దాదాపు క్లారిటీకి వచ్చింది. సీనియర్ నేతల మధ్య సమన్వయం రాబట్టిన అధిష్టానం ఎట్టకేలకు ఈ పదవిని బీసీకే ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. దాదాపు అందరి నోటా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ పేరే వచ్చినట్టు తెలిసింది.
అందరివాడుగా మంచి పేరున్న మహేశ్‌కు సీఎం రేవంత్ మద్దతు కూడా ఉంది. దీంతో మహేశ్‌కే పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఢిల్లీ నుంచి సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన శనివారం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పీసీసీ పదవి కోసం మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ప్రధానంగా పోటీలో ఉన్నారు.
ఎస్టీ కోటాలో బలరాం నాయక్ పేరు కూడా వినిపింపింది. కానీ ఎట్టకేలకు పీసీసీ పగ్గాలు బీసీకే ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉంది. బీసీకి ఇస్తే వందశాతం అది మహేశ్‌కే దక్కే చాన్స్ ఉందని మొదటి నుంచి ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని అధిష్టానానికి బలంగా వినిపించడంతో మహేశ్‌కు అందరి మద్దతు లభించినట్టు తెలిసింది. ఇక అధికారిక ప్రకటనే లాంఛనంగా ఉంది.